హైదరాబాద్ ఉగ్ర కుట్రలో విస్తుపోయే నిజాలు.. అనంతగిరి కొండల్లో మారణాయుధాలతో శిక్షణ!
మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హెచ్‌యూటీతో సంబంధాలు ఉన్న 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు.
హైదరాబాద్ నగరమే లక్ష్యంగా హిజ్బ్-ఉత్-తహరీర్ (హెచ్‌యూటీ) అనే సంస్థ భారీ ఎత్తున పేలుళ్లకు వ్యూహం రచించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హెచ్‌యూటీతో సంబంధాలు ఉన్న 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు.
హైదరాబాద్‌లో దాడుల కోసం ఈ సంస్థ మూడంచెల విధానంలో యువతను ఉగ్రదాడుల వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలి దశలో యువతీ యువకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. రెండో దశలో తమ దగ్గరకు వచ్చిన వారికి సాంకేతిక, ఇతర అంశాల్లో పూర్తి శిక్షణ ఇస్తున్నారు. చివరిదైన మూడో దశలో వారితో నిర్ణీత ప్రదేశంలో దాడులు చేయిస్తారు. తమ సంస్థ పట్ల ఆకర్షితులైన యువతీ యువకులతో ఒకే సారి మూకుమ్మడి దాడులు నిర్వహించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు ఉన్నారు.
ఇటీవల హెచ్‌టీయూ సంస్థ పట్ల ఆకర్షితులైన యువకులకు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో ఎలా దాడి చేయాలని విషయంలో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడులే కాకుండా.. మారణాయుధాలతో కూడా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని పథక రచన చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్‌లో హెచ్‌యూటీకి మహ్మద్ సలీమ్ అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య బాధ్యుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహ్మద్ సలీమ్ నగరంలోని ఒక కళాశాలలో హెచ్‌వోడీగా పని చేస్తున్నారు. కొంత కాలంగా కుటుంబంతో పాటు గోల్కొండ బడాబజార్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంట్లోనే అనేక పర్యాయాలు ఇతరులతో సమావేశం అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్, మహ్మద్ సల్మాన్‌తో పాటు మరి కొందరు యువకులు ఇక్కడ నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
హెచ్‌యూటీ సంస్థ యువతీ, యువకులను ఆకర్షించేందుకు ఒక యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మత మార్పిడి, ఇతర అంశాలకు చెందిన 30కి పైగా వీడియోలు ఇందులో అప్‌లోడ్ చేశారు. దాదాపు 3,600 మంది ఈ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లుగా ఉన్నారు. ఈ వీడియోలు చూసి కొంత మంది హెచ్‌యూటీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపించినట్లు కూడా తెలుస్తున్నది. కాగా, హెచ్‌యూటీ సంబంధీకులతో మాట్లాడిన ఇతరులను కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా ఎవరికైనా ఉగ్ర దాడుల శిక్షణ ఇచ్చారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.