Telugu Global
CRIME

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌ – రూ.50 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ నగరంలోని సూరారంలో డ్రగ్స్‌ తయారీ ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌ – రూ.50 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం
X

హైదరాబాద్‌ నగరంలోని సూరారంలో డ్రగ్స్‌ తయారీ ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో డ్రగ్స్‌ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.50 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి వెల్లడించారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో 60 గ్రాముల క్రిస్టల్‌ మెథాంఫెటమైన్, 700 మిల్లీ లీటర్ల లిక్విడ్‌ మెథాంఫెటమైన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెప్పారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్‌ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కె.శ్రీనివాస్‌గా గుర్తించినట్టు ఎస్పీ చక్రవర్తి చెప్పారు. అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరంలోని గాజుల రామారంలో నివాసం ఉంటున్నాడని, డ్రగ్స్‌ తయారీపై అతనికి అవగాహన ఉందని తెలిపారు.

2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్‌ తయారు చేయగా.. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు జైలుకు పంపారని చెప్పారు. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం నరసింహరాజు, మణికంఠలతో కలిసి సూరారంలో ఒక ఇంట్లో మళ్లీ డ్రగ్స్‌ తయారు చేయడం మొదలు పెట్టాడని తెలిపారు.

నిందితులు ముగ్గురూ కలిసి గత రెండేళ్లుగా డ్రగ్స్‌ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని ఎస్పీ తెలిపారు. లిక్విడ్‌ మెథాంఫెటమైన్‌ తీసుకొని ప్రాసెస్‌ చేసి డ్రై చేస్తే క్రిస్టల్‌ మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తయారవుతుందని, అలా తయారు చేసిన మాదకద్రవ్యాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించారని చెప్పారు. ఈ విక్రయాలు సోషల్‌ మీడియా ద్వారా కొనసాగించారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

First Published:  2 Dec 2023 8:40 PM IST
Next Story