అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలకు నీటి ఊటే అవరోధం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిదవ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌జీఆర్‌ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు సొరంగంలో జరిపిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ సర్వేలో కొన్ని అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాలు పూర్తయితేనే ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటి ఊట కారణంగా నిపుణులు సూచించిన లోతువరకు మట్టిని తవ్వలేకపోతున్నారు. ఇదే సహాయ బృందాలకు ప్రధాన ఆటంకంగా మారింది. మరోవైపు టీబీఎం మిషన్ కటింగ్, పూడిక తీత, డీడాటరింగ్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నాయి. నేటికి టీబీఎం యంత్రం కటింగ్ సగానికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని భావిస్తున్న 13.85 కి.మీ. సొరంగంలో సహాయ బృందాలు ఇప్పటివరకు 13. 61 కిలోమీటర్ల వరకు చేరుకున్నారు. లోపల 9.2 మీటర్ల వెడల్పుతో ఉన్న టన్నెల్‌లో ఐదున్నర అడుగుల ఎత్తులో బురద, మట్టి పేర్కొన్నట్టు గుర్తించారు.