Telugu Global
CRIME

ఆ కేసులో దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు

ఈ ఇద్దరూ దేశం విడిచి వెళ్లొద్దు. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశం

ఆ కేసులో దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు
X

చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్: దేవినేని అవినాష్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ముగించింది. దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితులు మూడేళ్లుగా బెయిల్‌, ముందస్తు బెయిల్‌ కోరలేదు. ప్రభుత్వ మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారు. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసు. ప్రభుత్వం మారిన తర్వాత తప్పు బైటపడుతుందని తెలిసి కోర్టును ఆశ్రయించారు. జడ్‌ ప్లస్‌ సెక్యురిటీ ఉన్న మాజీ సీఎం ఇంటిపై దాడి చేశారు అంతేగాక ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాశ్‌ ప్రధాన సూత్రధారి, పాత్రధారి. అవినాశ్‌ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా దర్యాప్తు చేయకుండా తాత్సారం చేశారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి కారణాలు కనిపించ లేదు. జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ దేశం విడిచి వెళ్లొద్దు. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.

First Published:  25 Feb 2025 2:05 PM IST
Next Story