బ్యాంక్ మేనేజర్‌నూ బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. - ఖాతా నుంచి రూ.2,24,967 నగదు మాయం
బ్యాంకుకు వెళ్లిన అనంతరం సకల్‌దేవ్ సింగ్ తనకు ఫోన్ కాల్ వచ్చిన నంబరుకు తానే కాల్ చేశాడు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్‌డేట్ చేయాలని సూచించగా, కావడం లేదని చెప్పాడు.
సాధారణ పౌరులు సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్నారంటే.. అవగాహన లేకపోవడమని భావిస్తాం. కానీ, ఏకంగా ఒక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌నే బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. తాజాగా జరిగిన ఈ ఉదంతంలో సదరు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతా నుంచి మూడు దఫాలుగా రూ.2,24967 నగదు డ్రా చేయడం గమనార్హం. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు సదరు బ్యాంకు అధికారి.
బీహార్‌కు చెందిన సకల్‌దేవ్ సింగ్ హన్మకొండ జిల్లా పరకాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. హన్మకొండలోని సుబేదారిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయనకు ఓ మొబైల్ నుంచి `మీ ఖాతా డీ యాక్టివేట్ అయ్యే అవకాశముంది.. దీనిని నివారించేందుకు వెంటనే పాన్ కార్డును అప్‌డేట్ చేయండి` అని మెసేజ్ వచ్చింది. శుక్రవారం ఉదయం ఆ మెసేజ్‌ని గమనించిన సదరు బ్యాంకు అధికారి.. దానిని క్లిక్ చేసి.. పాన్ కార్డు అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది సబ్మిట్ కాలేదు. దీంతో మరో నంబరు నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. పాన్ కార్డు అప్‌డేట్ చేసేందుకు తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా.. తాను బస్సులో ఉన్నానని, తర్వాత చేస్తానని సమాధానమిచ్చాడు.
బ్యాంకుకు వెళ్లిన అనంతరం సకల్‌దేవ్ సింగ్ తనకు ఫోన్ కాల్ వచ్చిన నంబరుకు తానే కాల్ చేశాడు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్‌డేట్ చేయాలని సూచించగా, కావడం లేదని చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి వేరే నంబరు నుంచి ఓ లింక్ సకల్‌దేవ్‌సింగ్ ఫోన్‌కి పంపించాడు. ఆ లింక్‌ను సకల్‌దేవ్ ఓపెన్ చేయగా.. అతని ఖాతా నుంచి మూడు విడతలుగా రూ.99,990, రూ.99,990, రూ.24,987 చొప్పున నగదు విత్ డ్రా అయ్యింది. దీనిని గుర్తించిన సకల్‌దేవ్ సింగ్ శుక్రవారం రాత్రి పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పి.కిషన్ ఈ ఘటనపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.