బతిమాలి ఆయిల్ కొట్టించుకున్నారు.. డబ్బడిగితే ప్రాణం తీశారు..
సంజయ్ అడ్డుకోబోగా, అతనిపైనా పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో సంజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
అర్ధరాత్రి వేళ.. పెట్రోల్ బంకు సమయం ముగిసినా.. సేల్స్‌మన్‌ని బతిమాలి మరీ ఆయిల్ కొట్టించుకున్నారు.. ఆపై డబ్బు అడిగితే.. కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం పనిచేయడం లేదని, నగదు ఇవ్వాలని కోరితే.. వాగ్వాదానికి దిగారు. సేల్స్‌మన్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన మరో సేల్స్‌మన్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని పెట్రోల్ బంకులో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి నార్సింగి ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శంకర్‌పల్లి మండలం పొద్దటూరుకు చెందిన ఎన్.సంజయ్ (19) స్థానిక పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్‌లో 15 రోజుల క్రితం సేల్స్‌మన్‌గా ఉద్యోగంలో చేరాడు. సోమవారం అర్ధరాత్రి విధులు ముగించుకొని తోటి ఉద్యోగి చోటూతో కలిసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో జన్వాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అనోక్ (24), పెయింటర్ నరేందర్ (25), డ్రైవర్ మల్లేశ్ (28) కారులో బంకుకు వచ్చారు. సమయం ముగిసిందని.. బంకు మూసేశామని చెప్పగా, చాలా దూరం వెళ్లాల్సి ఉందంటూ బతిమాలి ఆయిల్ కొట్టించుకున్నారు. ఆయిల్ కొట్టిన చోటూ ఆపై డబ్బు అడగగా, కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం పనిచేయడం లేదని, నగదు ఇవ్వాలని చోటూ కోరగా.. మద్యం మత్తులో ఉన్న ముగ్గురూ అతనికితో వాగ్వివాదానికి దిగారు. ఆపై చోటూపై దాడికి పాల్పడ్డారు. సంజయ్ అడ్డుకోబోగా, అతనిపైనా పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో సంజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సంజయ్‌ని చోటూ నార్సింగిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు చెప్పారు.
సంజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్వాడలో భారీ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేవారు. సంజయ్ తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారు. వారికి అతను రెండో కుమారుడు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుల్లో అనోక్, మల్లేశ్‌లపై గతంలో రెండు దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.