కొత్త సినిమాలు బస్సులు, లోకల్ చానళ్లలో ప్రదర్శిస్తే క్రిమినల్ కేసులు
తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
కొత్త సినిమాలను ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సులు, ఇతర వాహనాలు, లోకల్ కేబుల్ చానల్స్ లో ప్రదర్శిస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్‌లైన్, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలోనూ పైరసీ సినిమాలు ప్రదర్శించడం నేరమేనని తెలిపారు. ఇలా చేయడం కాపీరైట్ చట్టం కింద నేరమని తెలిపారు. కొత్త సినిమాలను ఇలా ప్రదర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నష్టపోతుందని, అలాగే సినీ పరిశ్రమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వేలాది మంది కార్మికులు, ఆర్టిస్టులు ఉపాధిని కోల్పోతారని, నిర్మాతలు ఆర్థికంగా ఛిన్నాభిన్నమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాంగో, ఆదిత్య మూవీస్, శ్రీ బాలాజీ వీడియోస్ మాత్రమే సినిమాలకు సంబంధించిన అధీకృత సంస్థలని.. వాళ్లు విడుదల చేసేవి మాత్రమే అధికారికమైనవని తెలిపారు. వాటిని మాత్రమే బస్సులు, కేబుల్ చానల్స్ లో ప్రదర్శించడానికి అవకాశం ఉందని తెలిపారు. పైరసీని నిర్మూలించి సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహద పడేందుకు అందరూ తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.