Telugu Global
CRIME

'ఖాకీ' వెబ్ సిరీస్ ఐపీఎస్ అధికారిపై అవినీతి ఆరోపణలు

ఐపీఎస్ అధికారి అమిత్ లోఢా అక్రమాలపై ఫిర్యాదు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖాకీ వెబ్ సిరీస్ ఐపీఎస్ అధికారిపై అవినీతి ఆరోపణలు
X

'ఖాకీ : ది బీహార్ చాప్టర్' అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే రోజు 24 మంది హత్యలకు కారణమైన కరుడుగట్టిన నేరస్తుడిని ఓ ఐపీఎస్ అధికారి ఎలా పట్టుకున్నారనే కథాంశంతో ఈ 'ఖాకీ' వెబ్ సిరీస్ రూపొందింది. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి.. తన జీవితంలో జరిగిన కీలకమైన ఘట్టాన్ని తెలియజేస్తూ అమిత్ లోఢా అనే బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాసిన 'బీహార్ డైరీస్' అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.

తను రాసిన పుస్తకాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు కేవలం రూ.1 కి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో ఆయన పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అవకాశం ఉండదు. అయితే, పైకి రూ. 1కే ఒప్పందం చేసుకున్నట్లు చెప్పినా.. ఆయన భార్య అకౌంట్‌కు మాత్రం రూ. 49 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సిరీస్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందానికి ముందే సదరు మొత్తం అకౌంట్‌లో జమ అయ్యిందని పోలీసులు తెలిపారు.

లోఢా అక్రమాలపై ఫిర్యాదు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఇప్పుడే కాదని.. గయలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించబడిన దగ్గర నుంచి లోఢా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, లోఢాపై నమోదైన కేసును దర్యాప్తు చేయడానికి ఓ డీఎస్పీని నియమించారు.

First Published:  9 Dec 2022 7:54 AM IST
Next Story