Telugu Global
CRIME

గురువును కడతేర్చిన విద్యార్థి.. - తరగతి గదిలోనే దారుణం

కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో పాటు అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు, గణిత అధ్యాపకుడు కలసి శనివారం మందలించారు.

గురువును కడతేర్చిన విద్యార్థి.. - తరగతి గదిలోనే దారుణం
X

మార్కులు తక్కువగా వచ్చాయని ఉపాధ్యాయుడు మందలించడాన్ని అవమానంగా భావించిన ఓ విద్యార్థి.. ఆ ఉపాధ్యాయుడిని దారుణంగా హతమార్చిన ఘటన అస్సాంలో జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన ఉపాధ్యాయుడి స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు. తరగతి గదిలోనే ఈ ఘటన జరగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌ బాబు రసాయన శాస్త్రం అధ్యాపకుడు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో దాదాపు పదేళ్లు పనిచేశారు. తర్వాత మిత్రులతో కలిసి అస్సాంలోని శివసాగర్‌ ప్రాంతంలో సొంతంగా కాలేజీని ఏర్పాటు చేశారు. 13 సంవత్సరాలుగా ఆయన ఆ కాలేజీకి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య అపర్ణ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో పాటు అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు, గణిత అధ్యాపకుడు కలసి శనివారం మందలించారు. ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని చెప్పారు. విద్యార్థులను సమక్షంలోనే తనను మందలించడాన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి సాయంత్రం తన వెంట కత్తి తీసుకొచ్చి తరగతి గదిలో కూర్చున్నాడు.

ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు కెమిస్ట్రీ క్లాస్‌ చెబుతుండగా, ఒక్కసారిగా ఆయనపై కత్తితో దాడి చేశాడు. తల, ఛాతీపై పొడవడంతో తీవ్ర గాయాలపాలైన రాజేశ్‌బాబు.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. దాడికి పాల్పడ్డ విద్యార్థి తండ్రి చనిపోయాడని, అతనికి నేర చరిత్ర ఉన్నట్టు తర్వాత తెలిసిందని మృతుడి సోదరుడు నవీన్‌ వెల్లడించారు.

First Published:  9 July 2024 2:20 PM IST
Next Story