Telugu Global
CRIME

100 మందితో వచ్చి పెళ్లి కూతురు కిడ్నాప్.. హైదరాబాద్‌‌లో సంచలన ఘటన

పెళ్లి కూతురు కిడ్నాప్ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీసీ ఉమామహేశ్వరరావు.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

100 మందితో వచ్చి పెళ్లి కూతురు కిడ్నాప్.. హైదరాబాద్‌‌లో సంచలన ఘటన
X

హైదరాబాద్ నగర శివారు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ పెళ్లి కూతురు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఆదిభట్లకు సమీపంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్నగూడలో పెళ్లికూతురైన డెంటల్ డాక్టర్ వైశాలిని దాదాపు 100 మంది యువకులు వచ్చి కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని యువకులు ఇంటిపై దాడి చేసి, ఆవరణలో ఉన్న బైకులు, కార్లు ధ్వంసం చేశారు. అంతే కాకుండా కిడ్నాప్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు, బంధువులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత యువతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పెళ్లి కూతురు కిడ్నాప్ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీసీ ఉమామహేశ్వరరావు.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని ఒక ఇంట్లో పెళ్లి వేడుకలు జరగుతున్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడ అంతా సంతోషకరమైన వాతావరణ నెలకొన్నది. ఇంతలోనే దాదాపు 100 మంది మాస్కులు ధరించిన యువకులు కర్రలు, రాడ్లు పట్టుకొని డెంటల్ డాక్టర్ వైశాలి (పెళ్లి కూతురు) ఇంటికి వచ్చారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వత ఇంట్లోకి చొరబడి పెళ్లి కూతురును తమ వెంట తీసుకొని వెళ్లారు. ఈ క్రమంలో కిడ్నాప్‌ను అడ్డుకోవడానికి బంధువులు ప్రయత్నం చేయగా వారి కూడా గాయపరిచారు.

వైశాలిని బలవంతంగా తమ వెంట తెచ్చుకున్న వాహనాల్లో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఏం జరిగిందో స్థానికులకు అర్థం కాలేదు. అయితే తమ కూతురిని నవీన్ రెడ్డి అనే యువకుడే కొంత మంది యువకులతో వచ్చి కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఒకేసారి అంత మంది ఇంటిపైకి రావడంతో తాము అడ్డుకోలేక పోయామని తెలిపారు.

కాగా, గతంలో వైశాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో.. మిస్టర్ టీ టైం అనే దుకాణం ఓనర్ అయిన నవీన్ రెడ్డి సంబంధం కూడా వచ్చిందని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్లోనే నవీన్ గురించి తెలిసి తాము తిరస్కరించామని, కానీ అప్పటి నుంచి వైశాలిని వేధింపులకు గురి చేస్తున్నట్లు వాళ్లు పోలీసులకు తెలిపారు. ఎలాగైనా తన కూతురిని నవీన్ రెడ్డి చెర నుంచి కాపాడాలని కోరారు.

కాగా, కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల వివరాలను సేకరిస్తూ, సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కిడ్నాప్ కేసును ఛేదిస్తామని ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు.

First Published:  9 Dec 2022 4:48 PM IST
Next Story