అదనపు కట్నం తేవాలంటూ.. భార్యను పుట్టింటికి పంపిన బీజేపీ నాయకుడు
పెండ్లయిన వారం రోజుల నుంచే అదనపు కట్నం తేవాలంటూ నిత్యం భార్య అంజలిని వేధిస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక 2020 ఫిబ్రవరిలో సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.
ఆతను జాతీయ పార్టీ అయిన బీజేపీ అనుబంధ సంఘానికి మాజీ జిల్లా అధ్యక్షుడు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి నీతి బోధలు చేస్తుంటాడు. కానీ, ఆ నాయకుడే నిత్యం భార్యను వేధిస్తూ.. ఇప్పుడు ఏకంగా అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించాడు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన బుద్ద పడగ శ్రీనివాస్‌రెడ్డి.. బీజేపీ సైనిక విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయనకు అంజలితో 2019లో వివాహం జరిగింది. వారికి ఒక బాబు కూడా పుట్టాడు.
పెండ్లయిన వారం రోజుల నుంచే అదనపు కట్నం తేవాలంటూ నిత్యం భార్య అంజలిని వేధిస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక 2020 ఫిబ్రవరిలో సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు సఖి కేంద్రానికి భార్యభర్తలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా సరే శ్రీనివాస్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఇక కొడుకు పుట్టిన తర్వాత వేధింపులు మరింతగా పెరిగాయి. ఆ బాబు నాకు పుట్టలేదని.. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ సూటి పోటి మాటలతో వేధించేవాడు. అంతే కాకుండా విడాకులు ఇస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. నిత్యం గొడవలు జరుగుతుండటమే కాకుండా కుటుంబ సభ్యలతో కలిసి తనపై దాడి చేశాడని అంజలి చెబుతోంది. ఈ క్రమంలో శ్రీనవాస్ రెడ్డి ఆమెను పుట్టింటికి పంపించేశాడు.
అయితే బుధవారం అంజలి తన ఏడాది కొడుకుతో కలిసి అత్తవారింటికి వచ్చింది. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగింది. ఆమె ఆందోళనకు మరి కొందరు మహిళలు సంఘీభావం ప్రకటించారు. అంజలికి న్యాయం జరిగే వరకు ఆమెతో కలిసి పోరాడతామని చెప్పారు. అంజలి రావడంతో శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. తనకు రాజకీయ నాయకుల పరిచయాలు, అండదండలు ఉన్నాయని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు. తనను కాపురానికి తీసుకెళ్లే వరకు ఇంటి ముందే బైఠాయిస్తానని అంజలి చెబుతోంది.