బీమా సొమ్ము కొట్టేయాలని.. బిగ్ ప్లాన్..! - వికటించిన వ్యవహారం
దీనిని ధ్రువీకరించేందుకు డిసెంబరులో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన అతని తల్లిదండ్రులు తమ కుమారుడు దినేశ్ దే నంటూ ఓ మృతదేహాన్ని సేకరించారు.
తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించేయాలనుకుంది ఆ ముఠా. అందుకు ఎల్ఐసీనే కరెక్టని భావించింది. దీనికోసం భారీ ప్లానే రూపొందించింది. ఆచరణలో అన్ని కరెక్టుగానే చేశామని భావించింది. అయితే వారి పప్పులు ఎల్ఐసీ అధికారుల వద్ద ఉడకలేదు. చివరికి వారి బాగోతం బయటపడటంతో ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన దినేశ్ టక్సలే నకిలీ ఆదాయ ధ్రువపత్రాలు సృష్టించి.. రూ.2 కోట్లకు బీమా పాలసీ తీసుకున్నాడు. 2015 జూలై 5న పాలసీ మంజూరైంది. 2017 మార్చి 14న అతని తల్లి నందా భాయ్ టక్సలే దరఖాస్తు చేసుకుంది. తన కుమారుడు దినేశ్ టక్సలే 2016 డిసెంబరు 25న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని ఆమె పేర్కొంది.
దీనిని ధ్రువీకరించేందుకు డిసెంబరులో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన అతని తల్లిదండ్రులు తమ కుమారుడు దినేశ్ దే నంటూ ఓ మృతదేహాన్ని సేకరించారు. దీంతో పోస్టుమార్టం అనంతరం వారు మృతదేహాన్ని వారికి అప్పగించారు. అనంతరం దినేశ్ పేరిట వారు మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సేకరించారు.
వీటి ఆధారంగా బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేశారు. డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ తక్కువ సమయంలోనే క్లెయిమ్‌కు రావడంతో ఈ వ్యవహారంపై ఎల్ఐసీ అధికారులు అనుమానంతో విచారణ నిర్వహించారు. దీంతో వారి గుట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో వారు గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ అనంతరం దినేశ్‌ని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు.