బఠిండా ఘటనలో సైనికుడే హంతకుడు..! - విచారణలో నేరాన్ని అంగీకరించిన వైనం
విచారణలో భాగంగా మోహన్ దేశాయ్ తానే ఈ ఘటనకు పాల్పడినట్టు అంగీకరించాడు. వ్యక్తిగత కారణాలతో వారిని కాల్చి చంపినట్టు తెలిపాడు.
పంజాబ్‌లోని బఠిండా సైనిక స్థావరంలో నలుగురు జవాన్లను కాల్చి చంపిన ఘటనలో హంతకుడు తోటి జవానే అని విచారణలో తేలింది. పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బఠిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు.
సైనిక స్థావరంలో గన్నర్‌గా వ్యవహరిస్తున్న మోహన్ దేశాయ్ ఈ ఘటనకు పాల్పడ్డాడని ఖురానా తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మేజర్ అశుతోష్ శుక్లా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా మోహన్ దేశాయ్ తానే ఈ ఘటనకు పాల్పడినట్టు అంగీకరించాడు. వ్యక్తిగత కారణాలతో వారిని కాల్చి చంపినట్టు తెలిపాడు. మిలటరీ స్టేషన్‌లోని శతఘ్ని విభాగానికి చెందిన బ్యారెక్‌లో నలుగురు జవాన్లు నిద్రిస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్టు వెల్లడించాడు. ఈ ఘటనలో సాగర్ బన్నె (25), ఆర్. కమలేశ్ (24) జె.యోగేష్‌కుమార్ (24), సంతోష్ ఎం.నగరాల్ (25) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు కర్నాటకకు, మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు.
ఈ ఘటన అనంతరం తొలుత మోహన్ దేశాయ్ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కాల్పుల అనంతరం ఇద్దరు వ్యక్తులు కుర్తా-పైజమా ధరించి, ముఖానికి మాస్కులు పెట్టుకొని బయటికి వచ్చారని చెప్పాడు. నిందితుల్లో ఒకరి చేతుల్లో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతుల్లో గొడ్డలి ఉన్నట్టు ఆర్మీ అధికారులకు తెలిపాడు. ఎట్టకేలకు విచారణలో అతనే నిందితుడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.