Telugu Global
CRIME

హైదరాబాద్‌లో 'పరువు' పేరుతో హత్య.. ఇంకా దొరకని శవం

రెండు కుటుంబాలు ఒకే రకమైన పనులు చేస్తుండటంతో.. యువతీ యువకులకు పరిచయం అయ్యింది.

హైదరాబాద్‌లో పరువు పేరుతో హత్య.. ఇంకా దొరకని శవం
X

హైదరాబాద్ నగరంలో 'పరువు' పేరుతో మరో హత్య జరిగింది. ఒకే ఊరికి చెందిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించుకోవడం అమ్మాయి తరపు బంధువులకు ఇష్టం లేక అబ్బాయి ప్రాణాలు తీశారు. ఈ హత్య జరిగి ఇప్పటికే వారం రోజులు కావొస్తున్నా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కింద జీవనోపాధి కోసం పటాన్‌చెరు వలస వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన యువకుడికి.. అదే ఊరి నుంచి నగరానికి వచ్చిన మరో కుటుంబానికి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. రెండు కుటుంబాలు ఒకే ఊరికి, బీసీ కమ్యూనిటీకి చెందినా.. కులాలు మాత్రం వేరు.

రెండు కుటుంబాలు ఒకే రకమైన పనులు చేస్తుండటంతో.. యువతీ యువకులకు పరిచయం అయ్యింది. దీంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో యువతి ఓ రోజు వాట్సప్‌లో చాటింగ్ చేస్తుండగా.. సవతి తల్లి చూసి తండ్రికి చెప్పింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఆమెను చితకబాదాడు. అంతే కాకుండా తండ్రి తన సోదరుడిని పిలిచి ఈ విషయంపై తీవ్రంగా చర్చించారు. చివరికి యువకుడిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. యువతిని బెదిరించి.. యువకుడిని గాంధీనగర్‌లోని తమ ఇంటికి పిలవాలని చెప్పారు. దీంతో యువతి పటాన్‌చెరులోని యువకుడికి ఫోన్ చేసి.. ఇంట్లో ఎవరూ లేరని.. ఊరికి వెళ్లారని.. ఇక్కడికి రావాలని కోరింది. అయితే, యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు రాలేనని చెప్పాడు.

కాగా, యువతి సెల్‌లో నుంచి యువకుడు వ్యాలెట్‌కు డబ్బు పంపించారు.దాంతో యువకుడు అక్టోబర్ 8న అమీర్‌పేట వచ్చాడు. అక్కడ యువతిని కలుసుకొని మాట్లాడాడు. అప్పటికే అక్కడ ఉన్న తండ్రి, బాబాయ్ ఆ యువకుడిని బంధించి ఆటోలో లోయర్‌ట్యాంక్ బండ్‌లో ఉన్న శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. యువతిని, సవతి తల్లిని ఇంటికి వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత యువకుడిపై విచక్షణా రహితంగా చితకబాది చంపేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాలో శవాన్ని విసిరేశారు.

కాగా, యువకుడి ఫ్యామిలీ కుమారుడు కనపడం లేదని పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడి ఫోన్ ట్రేస్ చేసి విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే యువతి తండ్రిని, బాబాయ్‌ని అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శవం చాలా దూరం కొట్టుకొని పోవడంతో ఇంకా దొరకలేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో శవం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

First Published:  14 Oct 2022 9:13 AM IST
Next Story