సైబర్ వలలో ఆర్డీవో.. - కలెక్టర్ ఫొటో చూసి రూ.50 వేలు చెల్లించి బుక్కైన వైనం
మరోపక్క కలెక్టర్ ఫొటో చూడగానే.. వెనుకా ముందూ చూడకుండా ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నాడో కూడా తెలుసుకోకుండా.. చెల్లించేయడం. తద్వారా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్టయింది.
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏకంగా అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోవడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఫొటోతో ఇచ్చిన షాపింగ్ గిఫ్ట్ కార్డును చూసిన ఆర్డీవో వెంటనే రూ.50 వేలు పంపించడం గమనార్హం. ఆ తర్వాత సొమ్ము అందిందా లేదా అని ఆరా తీసే ప్రయత్నం చేయగా, తాను మోసపోయినట్టు గ్రహించాడు.
ఈ వ్యవహారంలో రెండు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది.. కలెక్టర్ ఫొటోతో షాపింగ్ గిఫ్ట్ కార్డు అందితే.. దానికి వెంటనే స్పందించి ఆర్డీవో రూ.50 వేలు చెల్లించాల్సిన అవసరం ఏముందనేది కాగా.. రెండోది ముందూ వెనుకా చూడకుండా ఆ సొమ్మును చెల్లించేయడం. కలెక్టర్‌పై భయంతోనో, భక్తితోనో ఆ సొమ్ము చెల్లించి ఉంటారనేది మొదటి అంశంలో అర్థమవుతున్న విషయం. కలెక్టర్ ఫొటోతో ఇలా గిఫ్ట్ కార్డు వచ్చినా.. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదనేది ఆర్డీవో ఆలోచించాల్సిన విషయం. లేదా ఇలా కార్డు అందడంపై కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని, లేదా ఆయన్నే ఆరా తీసినా సరిపోయేది. అలా కాకుండా.. వెంటనే డబ్బు చెల్లించడం ఒక కోణంలో చర్చనీయాంశంగా మారుతోంది.
మరోపక్క కలెక్టర్ ఫొటో చూడగానే.. వెనుకా ముందూ చూడకుండా ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నాడో కూడా తెలుసుకోకుండా.. చెల్లించేయడం. తద్వారా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్టయింది. ఈ వ్యవహారంపై తాను మోసపోయినట్టు గుర్తించి అనకాపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విచారణ చేసిన పోలీసులు నిందితుడు డెహ్రాడూన్ నుంచి మోసానికి పాల్పడినట్టు గుర్తించి.. అక్కడికి వెళ్లి.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్డీవో చెల్లించింది రూ.50 వేలు కాగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు డెహ్రాడూన్ వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.లక్షా 30 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.