ప్రాణం తీసిన రోబో పొరపాటు
రోబోలో లోపం వల్ల అది మనిషిని బాక్స్‌గా గుర్తించిందని ఈ ఘటనపై కంపెనీ పోలీసులకు వివరణ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించినట్టు తెలిపింది.
ఒక రోబో పొరపాటుతో ఒక వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో తాజాగా చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని ఒక వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఫ్యాక్టరీలో రోబో అనుసంధానంతో పనిచేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కంపెనీ ప్యాకింగ్ విభాగంలో దీనిని ఉపయోగిస్తున్నారు.
రోబో కూరగాయలతో నింపిన పెట్టెలను తీసి కన్వేయర్ బెల్టుపై వేయాల్సి ఉంటుంది. కానీ, మనిషిని కూరగాయలతో ప్యాక్ చేసిన పెట్టెగా పొరపాటు పడిన రోబో అతన్ని లాగి బెల్టుపై బలంగా పడేసింది. రోబో తన మర చేతులతో సదరు వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ, ముఖం ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
రోబోలో లోపం వల్ల అది మనిషిని బాక్స్‌గా గుర్తించిందని ఈ ఘటనపై కంపెనీ పోలీసులకు వివరణ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించినట్టు తెలిపింది. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తి దానిని బాగు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని వివరించింది. దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చిలో ఓ వాహన తయారీ సంస్థలో ఓ కార్మికుడు రోబో చేతిలో చిక్కి తీవ్రంగా గాయపడ్డాడు. టెక్నాలజీలో లోపాలుంటే రోబో వ్యవస్థ ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.