17 గోల్డ్ బార్లు తీసుకొచ్చిన నటి రన్యారావు
అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Actor Ranya Rao) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూఏఈ నుంచి నటి రన్యారావు 17 బంగారు బిస్కెట్లు (17 gold బార్స్) తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు తాను ప్రయాణించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ఆమె తెలియజేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాను వెల్లడించిన విషయాలను వీలైనంత రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు సమాచారం.
తాను బాగా అలసిపోయానని.. కొంత రెస్ట్ ఇప్పించాలని విచారణ సమయంలో రన్యా రావు అధికారులను అభ్యర్థించారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు సహకరిస్తానని.. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆమె పేర్కొన్నారు. రన్యా రావు గత ఏడాది 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని.. కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు.. ప్రతి టిప్‌లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. దీనికిగాను ప్రతి ట్రిప్‌కు సుమారు రూ. 12-13 లక్షలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు.
ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను.. విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. తరుచూ దుబాయ్‌కు వెళ్లడం. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన డ్రెస్‌లు వేసుకోవడంతో డౌట్ వచ్చి ఆమెపై నిఘా పెట్టగా.. ఈ స్మగ్లింగ్ వ్యవహారం బైటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వెనుక ఓ ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి ఆమెతో కలిసి పలుమార్లు దుబాయ్ వెళ్లడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.