ఫేక్ పత్రాలతో.. ఫేక్ రిజిస్ట్రేషన్లు.. - నిందితుడి గుట్టు రట్టు
ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా.. ఏయే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు.. వంటి వివరాలను సేకరించేందుకు డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ ధ్రువపత్రాలు, సబ్‌రిజిస్ట్రార్ల స్టాంపులు తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న వైనం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక నిందితుడిని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వంగవీటి మోహన రంగా హత్యానంతర పరిణామాల్లో కార్యాలయాల్లో రికార్డులు కాలిపోయాయి. దానిని ఆధారంగా చేసుకున్న నిందితుడు ఈ నకిలీ రిజిస్ట్రేషన్లకు తెరతీశాడని అధికారులు గుర్తించారు. అతను ఇప్పటివరకు 15కు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు వారి పరిశీలనలో వెల్లడైంది.
తనఖా, సేల్, మార్ట్‌గేజ్ డాక్యుమెంట్లే ఎక్కువ...
విశాఖపట్నంలో ఒక భూమికి సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్‌లో అవకతవకలపై డీఆర్ఐకి ఫిర్యాదులు అందాయి. దీంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగి విజయవాడకు చెందిన టి.రాజ్‌చైతన్య తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్టు గుర్తించారు. ఒక దస్తావేజు ఆధారంగా గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించగా, ఇప్పటివరకు అతను 15కు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలింది. వాటిలో తనఖా, సేల్, మార్ట్‌గేజ్ డాక్యుమెంట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
మరింత లోతుగా దర్యాప్తు..
ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా.. ఏయే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు.. వంటి వివరాలను సేకరించేందుకు డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని అంబాపురంలో భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిసింది. ఈలోగా దీనిపై విశాఖపట్నం వచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే అప్రమత్తమైన గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్లు చాకచక్యంగా వ్యవహరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన రాజ్ చైతన్యను గుర్తించి వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు రాజ్ చైతన్యను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ డాక్యుమెంట్ల గుట్టు రట్టయింది. నిందితుడిపై గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.