గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు
మాదాపూర్, మచిలిపట్నం ఆఫీసుల్లో తనిఖీలు
ఫార్ములా -ఈ రేస్ స్పాన్సర్ గా వ్యవహరించిన గ్రీన్ కో ఆఫీసుల్లో తెలంగాణ ఏసీబీ సోదాలు చేస్తోంది. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్ గ్రీన్ కో ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండగా, ఉదయం 10 గంటల తర్వాత ఏపీలోని మచిలిపట్నంలో గల గ్రీన్ కో ఆఫీసుకు తెలంగాణ ఏసీబీ అధికారులు చేరుకున్నారు. గ్రీన్ కోతో పాటు ఆ సంస్థకు సబ్సిడరీగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ ఆఫీసులోనూ తనిఖీలు చేస్తున్నారు. గ్రీన్ కోతో పాటు దాని సబ్సిడరీ సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఫార్ములా -ఈ రేసులో అనుచిత లబ్ధి పొందినందుకే గ్రీన్ కో బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఎందుకు విరాళాలు ఇవ్వాల్సి వచ్చింది.. గత ప్రభుత్వం నుంచి గ్రీన్ కో ఎలాంటి లబ్ధి పొందిందనే విషయాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.