పాత కక్షలతో కిరాతక హత్య.. - తండ్రి, ఇంటర్ చదివే కుమారుడు కలిసి దారుణం
మృతదేహాన్ని సంచిలో వేసుకుని తమ పొలం వద్దకు తీసుకెళ్లిన తండ్రీకొడుకులు.. మిర్చి పంట మధ్య వేసి.. గొడ్డలితో 16 ముక్కలుగా నరికేశారు. అనంతరం వాటిపై కర్రలు పేర్చి.. పెట్రోలు పోసి నిప్పంటించారు.
ఓ వ్యక్తిని హతమార్చి.. 16 ముక్కలుగా నరికి.. పొలంలో తగలబెట్టిన ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంత కిరాతకానికి ఒడిగట్టింది తండ్రీ కొడుకులు కావడం గమనార్హం. కొడుకు ఇంటర్ చదువుతున్న విద్యార్థి కావడం ఆందోళన కలిగించే అంశం. చిన్న వయసులోనే ఇంత ఘోరానికి సిద్ధమయ్యాడంటే సమాజంలో మనుషుల తీరు ఎంత దారుణంగా మారుతోందో అర్థం చేసుకోవడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా భావించవచ్చు. వివరాల్లోకెళితే..
దాచేపల్లికి చెందిన బొంబోతుల సైదులు, జి.కోటేశ్వరరావు (45) నగర పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి కోటేశ్వరరావు తన విధుల్లో భాగంగా విద్యుత్ మోటారును ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లాడు. అప్పటికే కాచుకుని ఉన్న సైదులు, అతని కుమారుడు (ఇంటర్ విద్యార్థి) కలిసి ఇనుప రాడ్లతో ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతదేహాన్ని సంచిలో వేసుకుని తమ పొలం వద్దకు తీసుకెళ్లిన తండ్రీకొడుకులు.. మిర్చి పంట మధ్య వేసి.. గొడ్డలితో 16 ముక్కలుగా నరికేశారు. అనంతరం వాటిపై కర్రలు పేర్చి.. పెట్రోలు పోసి నిప్పంటించారు. కోటేశ్వరరావు రాత్రి పది గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరా తీశారు. ఈ క్రమంలో వారికి సైదులు, అతని కుమారుడు ఎదురయ్యారు. వారిని కూడా ఆరా తీయగా.. తమకు తెలియదంటూ అక్కడినుంచి హడావుడిగా వెళ్లిపోయారు. దీంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. సైదులు పొలంలో మంటలను గమనించి అక్కడికి వెళ్లి నిశితంగా పరిశీలించగా, కాలిపోతున్న ఓ కాలి పాదం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
అనంతరం బంధువులంతా కలిసి సైదులు ఇంటికి వెళ్లగా, అప్పటికే తండ్రీ కొడుకులిద్దరూ దుస్తులు మార్చుకుని బయటికెళ్లేందుకు సిద్ధమయ్యారు. కోటేశ్వరరావు ఏమయ్యాడని నిలదీయగా, సమాధానం దాట వేశారు. అదే క్రమంలో సైదులు భార్య వారి వస్త్రాలను కాల్చేస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన తీరును గమనిస్తే.. పక్కా ప్లాన్‌తో చేసినట్టుగా అర్థమవుతోంది. సైదులుపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటాయని భావిస్తుండగా, వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు.