Telugu Global
CRIME

విజయవాడ పోస్టాఫీసులో రూ.1.5 కోట్లు గోల్ మాల్

ఈ అక్రమాలకు సంబంధించి తపాలా శాఖ ఉన్నతాధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంభకోణానికి సంబంధించి శాఖాపరంగా చేసిన అంతర్గత దర్యాప్తుపై నివేదిక, ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, స్టేట్‌మెంట్లు, తదితర వివరాలతో రావాలని పోలీసులు సూచించారు.

విజయవాడ పోస్టాఫీసులో రూ.1.5 కోట్లు గోల్ మాల్
X

విజయవాడ కృష్ణలంకలోని నెహ్రూనగర్ ఉప తపాలా కార్యాలయం పోస్టు మాస్టర్‌ నెమలికంటి మనోజ్‌ డిపాజటర్ల సొమ్ము భారీస్థాయిలో కాజేశారు. ఉన్నతాధికారులు తనిఖీ చేయడంతో సోమవారం ఈ విషయం బయటపడింది. దీంతో అధికారులు అతన్ని సస్పెండ్‌ చేశారు.

గత ఏడాది జూన్‌లో పోస్టు మాస్టర్‌గా విధుల్లో చేరాడు మనోజ్‌. ఈ కార్యాలయంలో దాదాపు 7 వేల వరకు పొదుపు, ఎఫ్‌డి, ఆర్డీ ఖాతాలు ఉన్నాయి. కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ శాతం మంది కూలినాలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము స్వాహా చేశాడు. దీనికి తోడు విచ్చలవిడిగా అప్పులు చేసి పలు వ్యాపారాలు చేశాడు. గుణదలలో చికెన్ షాపు అద్దెకు తీసుకుని కొంత కాలం నిర్వహించిన అనంతరం షాపు యజమానులను మభ్యపెట్టి వారికి తెలియకుండా తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మణిప్రియ అనే మహిళకు ఇచ్చి షాపు యజమానులపై రచ్చ యుగంధ‌ర్ అనే వ్యక్తితో కలిసి కోర్టులో వ్యాజ్యం కూడా వేసి నానాయాగీ చేస్తున్నాడు. అలాగే వడ్డీలు పెరిగిపోవడంతో కళ్ల ముందు కనిపిస్తున్న సొమ్మును అప్పులు తీర్చడానికి ఉపయోగించుకున్నాడు. చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు మరికొన్ని వ్యాపారాలు చేసినట్లు తేలింది. అవసరాలు పెరగడంతో ఖాతాదారులు డిపాజిట్‌ చేసే డబ్బును వారి పాస్‌పుస్తకాల్లో నమోదు చేయకుండా సొంత జేబులో వేసుకున్నాడు. వారికి నకిలీ ఖాతాలు సృష్టించి, వాటిలో డబ్బు వేస్తున్నట్లు అందరినీ మభ్యపెట్టాడు. వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లించే వాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వ్యవహారం ఆతర్వాత తిరగబడింది. సర్దుబాటు చేయలేక చేతులెత్తేశాడు. పోస్టల్‌ ఖాతా నుంచి మరికొంత సొమ్మును ఇతరుల ఖాతాలకు మళ్లించి, ఆ మొత్తాన్ని వారి నుంచి తిరిగి తీసుకునేవాడు.

విజయవాడ డివిజన్‌ ఎస్‌ఎస్‌పీవో హరిప్రసాద్‌ శర్మ స్పందించి, ఏడుగురు అధికారులతో కూడిన బృందాన్ని విచారణ నిమిత్తం ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి ఈ బృందం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వారు ఇచ్చిన మొత్తాన్ని డిపాటిట్‌ చేశారా? దాని తాలూకూ పాస్‌పుస్తకంలో నమోదు చేశారా? అన్న విషయాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తు ప్రకారం దాదాపు రూ. కోటి వరకు సొమ్మును స్వాహా చేసినట్లు తేలింది. వారం రోజుల తర్వాత కానీ పూర్తి సమాచారం వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్వయంగా నిందితుడు అధికారుల విచారణలో అంగీకరించాడు. ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు రికవరీ చేసినట్లు తెలిసింది.

ఈ అక్రమాలకు సంబంధించి తపాలా శాఖ ఉన్నతాధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంభకోణానికి సంబంధించి శాఖాపరంగా చేసిన అంతర్గత దర్యాప్తుపై నివేదిక, ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, స్టేట్‌మెంట్లు, తదితర వివరాలతో రావాలని పోలీసులు సూచించారు. దీంతో విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని వివరాలతో స్టేషన్‌లో అందజేయనున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేయనున్నారు.

నిధుల కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో పలువురు డిపాజిటర్లు, ఖాతాదారులు బుధవారం కార్యాలయం వద్దకు వచ్చి తమ డిపాజిట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది వారు చెల్లించిన నగదు మొత్తం పుస్తకాల్లో నమోదు అయిందీ లేనిది పరిశీలించి పుస్తకాల్లో ఎంట్రీలు లేని వారు ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

First Published:  8 Sept 2022 3:00 PM GMT
Next Story