Telugu Global
CRIME

'నలుగురం చచ్చిపోతాం'.. ఫేస్‌బుల్ లైవ్‌లో అన్న మాటలే నిజమయ్యాయి

హైవేలపై అత్యంత వేగంగా ప్రయాణిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ప్రమాదానికి ముందు మృతులు పెట్టిన ఫేస్‌బుక్ లైవ్ వీడియో వైరల్‌గా మారింది.

నలుగురం చచ్చిపోతాం.. ఫేస్‌బుల్ లైవ్‌లో అన్న మాటలే నిజమయ్యాయి
X

బీఎండబ్ల్యూ కారు.. విశాలమైన ఎక్స్‌ప్రెస్ హైవే.. కారులో నలుగురు ఫ్రెండ్స్. ఇక వాళ్లను ఆపేదెవరు.? అద్భుతంగా కనిపిస్తున్న ఆ రోడ్డుపై తమ లగ్జరీ కారును అత్యంత వేగంతో పరుగులు పెట్టించారు. అదే సమయంలో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ పెట్టి తాము ఎంత స్పీడ్‌తో వెళ్తున్నది చూపిస్తున్నాడు. కారు 200 కిలోమీటర్ల వేగం దాటి పోయింది. 230కి టచ్ అయ్యింది. కాపేపట్లో 300 కిలోమీటర్ల వేగం కూడా టచ్ చేస్తామని చెబుతున్నాడు. వెనక కూర్చున్న ఫ్రెండ్ మాత్రం 'ఇలాగే నడిపితే నలుగురం చచ్చిపోతాం' అని అంటూనే ఉన్నాడు. ఇంతలోనే అనుకోని ఘోరం. వాళ్ల కారు నేరుగా ఒక ట్రక్కును ఢీకొన్నది. అత్యంత వేగంగా ఉండటంతో కారు నుజ్జు నుజ్జ అయ్యి.. నలుగురు స్నేహితులు మరణించారు. రోడ్డుపై అతివేగం ఎంత ప్రమాదకరమైనదో మరోసారి తెలియజేసింది.

టాటా ట్రస్ట్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రి ఓ లగ్జరీ కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించిన సంగతి మరిచిపోకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్ వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు స్నేహితులు మరణించారు. కాగా, ఈ ఘటన జరగడానికి ముందు కారు అత్యంత వేగంగా ప్రయాణించినట్లు.. ఓ ఫేస్‌బుక్ లైవ్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. బీహార్ రోహ్‌తాస్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ ఆ బీఎండబ్ల్యూ కారును నడుపుతున్నాడు. ఆ కారులో అతనితో పాటు స్నేహితులు దీపక్ కుమార్ (ఇంజనీర్), అఖిలేశ్ సింగ్ (రియల్టర్), ముఖేష్ (వ్యాపారి) ఉన్నారు. వాళ్లంతా బీహార్ నుంచి ఢిల్లీకి కారులో వెళ్తున్నారు.

ఆ సమయంలో కారులోని వేగాన్ని చూపించడానికి వాళ్లు ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. పక్కన ఉన్న వాళ్లు ఎంకరేజ్ చేస్తుండటంతో డ్రైవింగ్ చేస్తున్న ఆనంద్ ప్రకాశ్ వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వాళ్లు ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోయింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పూర్తి కాలేదని, అక్కడక్కడా ఇంకా ప్యాచ్ వర్క్ నడుస్తోందని.. ఈ విషయం తెలియక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని పోలీసులు అంటున్నారు. లగ్జరీ కార్లు 300 కిలోమీటర్ల స్పీడైనా వెళ్తాయి. కానీ, మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ అందుకు అనుగుణంగా ఉండవని పోలీసులు చెప్తున్నారు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గురైనా కారు వారి సొంతం కాదని.. ఓ ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన యజమాని నుంచి అడిగి తీసుకున్నట్లు తెలుస్తున్నది.

First Published:  17 Oct 2022 4:14 AM GMT
Next Story