ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య .. నాలుగు రోజులపాటు ఇంట్లోనే శవం
Courier boy murdered for iPhone in Karnataka: హేమంత్ దత్ కు ఐఫోన్ అందించడానికి వెళ్లిన తర్వాతే నాయక్ తిరిగి రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా గోనెసంచితో అనుమానాస్పద రీతిలో హేమంత్ బయటకు వెళ్లినట్టు గుర్తించారు.
ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐ-ఫోన్ కు డబ్బు చెల్లించలేక డెలివరీ బాయ్ నే హత్య చేశాడు ఒక యువకుడు. నాలుగు రోజులపాటు శవాన్ని తన ఇంటిలోనే దాచి పెట్టాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
హసన్ జిల్లాలోని హరికేర్ లో నివాసం ఉంటున్న హేమంత్ దత్ ఇటీవల ఆన్ లైన్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను ఆర్డర్ చేశాడు. ఆ ఫోన్ ను డెలివరీ బాయ్ నాయక్ తీసుకొచ్చాడు. ఐఫోన్ కోసం 40 వేల రూపాయలు చెల్లించాలని డెలివరీ బాయ్ కోరగా తన దగ్గర డబ్బులు లేవని హేమంత్ దత్ చెప్పాడు. దాంతో ఫోన్ వెనక్కి ఇవ్వాలని కోరగా.. తన దగ్గర ఉన్న కత్తితో డెలివరీ బాయ్ ని చంపేశాడు.
అనంతరం నాలుగు రోజులపాటు శవాన్ని తన ఇంటిలోనే దాచి పెట్టాడు. ఒకరోజు రాత్రి గోనెసంచెలో డెలివరీ బాయ్ శవాన్ని కుక్కి తన బైక్ పై తీసుకెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద దహనం చేశాడు. ట్రాక్ పక్కన గుర్తు తెలియని శవం కాలిపడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతదేహంపై కత్తిపోటులో ఉండడాన్ని గుర్తించారు. మరణానికి ముందు డెలివరీ బాయ్ ఎక్కడెక్కడికి వెళ్లారు అన్నదానిపై అతడు పనిచేస్తున్న సంస్థలో ఆరా తీశారు.
హేమంత్ దత్ కు ఐఫోన్ అందించడానికి వెళ్లిన తర్వాతే నాయక్ తిరిగి రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా గోనెసంచితో అనుమానాస్పద రీతిలో హేమంత్ బయటకు వెళ్లినట్టు గుర్తించారు. దాంతో హేమంత్ దత్ ను అదుపులోనికి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని చెప్పాడు. తనకు ఐఫోన్ అంటే ఇష్టమని కానీ చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో నాయక్ ను చంపేశానని 20 ఏళ్ల హేమంత్ దత్ అంగీకరించాడు.