టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 9 మంది అరెస్ట్.. - నిందితుల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే
ప్రవీణ్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ కలిసి కార్యాలయ ఇన్‌చార్జి కంప్యూటర్ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నారు. వాటిని అదే ఆఫీసులో పలు కాపీలు చేసిన ప్రవీణ్.. రేణుకకు విక్రయించాడు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం. వారే సూత్రధారులు, పాత్రధారులు కూడా కావడం శోచనీయం. బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గోషామహల్ ఏసీపీ సతీష్‌కుమార్, బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ శంకర్, టాస్క్‌ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రఘునాథ్‌తో కలిసి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే సోమవారం రాత్రి కేసుకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ (32) స్వస్థలం ఏపీలోని రాజమహేంద్రవరం. బీటెక్ పూర్తిచేసిన అతను.. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో అదనపు ఎస్పీగా పనిచేసిన తన తండ్రి విధినిర్వహణలోనే మృతిచెందడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడు. అదే ప్రెస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా అతనికి బాధ్యతలు అప్పగించారు. 2017 నుంచి అతను టీఎస్‌పీఎస్‌సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో)గా పనిచేస్తున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన ఎల్.రేణుక (35) వనపర్తి గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె గతంలో గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేసిన సమయంలో.. దరఖాస్తులో పొరపాటును సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. అతని ఫోన్ నంబర్ తీసుకున్న ఆమె తరచూ అతనితో మాట్లాడుతుండేది.
ప్రస్తుతం తన సోదరుడు కె.రాజేశ్వర్ నాయక్ (32) పోటీపరీక్షలకు సిద్ధమవుతుండటంతో రేణుక.. ప్రవీణ్‌ను సంప్రదించింది. ప్రశ్నపత్రాలను కొనేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఆమె భర్త.. వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఢాక్యానాయక్ (38) కూడా ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ వ్యవహారంలో అదే కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న ఎ.రాజశేఖరర్‌రెడ్డి (35) కూడా ప్రవీణ్‌కి సహకరించాడు.
ప్రవీణ్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ కలిసి కార్యాలయ ఇన్‌చార్జి కంప్యూటర్ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నారు. వాటిని అదే ఆఫీసులో పలు కాపీలు చేసిన ప్రవీణ్.. రేణుకకు విక్రయించాడు. ఇదే సమయంలో వాటిని క్యాష్ చేసుకునేందుకు రేణుక, ఢాక్యానాయక్ దంపతులు మరో పథకం వేశారు. మేడ్చల్ కానిస్టేబుల్ కె.శ్రీనివాస్ (30) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకుని అతన్ని సంప్రదించారు. తాను ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్నానంటూ.. మహబూబ్‌నగర్‌కు చెందిన నీలేష్‌నాయక్, గోపాల్ నాయక్ అనే మరో ఇద్దరి సమాచారం అందించాడు. వారికి ఈ పేపర్లను రూ.13 లక్షలకు వీరు విక్రయించారు. ప్రవీణ్‌కి వీరు పరీక్షకు ముందు రూ.5 లక్షలు, తర్వాత మరో రూ.5 లక్షలు చెల్లించారు.
ప్రశ్నపత్రాలు లీకైనట్టు గుర్తించిన అధికారులు ప్రవీణ్ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో రాజశేఖరరెడ్డితో పాటు నిందితుల వివరాలు బయటపడ్డాయి. నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.