టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి!
3 మీటర్ల లోతున మృతదేహాలు గుర్తించిన రెస్క్యూ టీమ్

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన రోజే వారంతా టన్నెల్ లో 3 మీటర్ల లోతున బురద నీటిలో కూరుకుపోయినట్టుగా రెస్క్యూ టీమ్ శుక్రవారం సాయంత్రం గుర్తించింది. మృతదేహాలను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సాయంతో గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెస్క్యూ టీమ్‌లతో పాటు ఐఐటీ మద్రాస్ కు చెందిన ఎక్స్ పర్టులు ఆపరేషన్ చేపట్టారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన ఎక్స్‌పర్టులే మృతదేహాల గుర్తింపులో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈనెల 22న ఉదయం ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ఇన్‌లెట్ 13.85 కి.మీ.ల వద్ద పనులు చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్‌లో పని చేస్తున్న 50 మందిలో 42 మంది ప్రాణాలతో బయట పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో పని చేస్తున్న ఇంజనీర్లు, కార్మికులు ఎనిమిది అక్కడే చిక్కుకుపోయారు. మృతిచెందిన వారిలో జేపీ అసోసియేట్స్ కు చెందిన మనోజ్ కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్‌ఈ), రాబిన్ సన్ సంస్థకు చెందిన టీబీఎం ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్, కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. వీరంతా జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. ఈనెల 22న టన్నెల్ కూలిపోతే ఏడు రోజులకు అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను గుర్తించారు. టన్నెల్ చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.