ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టుల మృతి
చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఛత్తీస్‌గఢ్-ఒడిషా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ౧౪ మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ ఉదయం కూడా కాల్పులు కొనసాగాయి. కాల్పుల అనంతరం అక్కడ తనిఖీలు చేపట్టగా పది మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవన్‌ను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు.
కీలక నేతలు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. చిత్తూరు జిల్లా వాసి అయిన చలపతిపై ప్రభుత్వం గతంలో రూ. కోటి రివార్డు ప్రకటించింది.