తెలుగు మార్కెట్ పై మరో తమిళ హీరో ఫోకస్ ..!
అయితే తాజాగా సూర్య ఓ తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.
కోలీవుడ్‌కు చెందిన హీరోలకు మొదటి నుంచి తెలుగులో మార్కెట్ వుంది. సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు విజయ్, అజిత్, సూర్య, కార్తీ, ధనుష్, విశాల్, శివ కార్తికేయన్ లకు తెలుగులో మార్కెట్ ఉంది. వీరు నటించే తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య తమిళ హీరోలు రూట్ మార్చారు. డైరెక్టుగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు.
తమిళ అగ్ర హీరో విజయ్.. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇక మరో హీరో ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. యంగ్ హీరో శివ కార్తికేయన్ తెలుగులో జాతి రత్నాలు సినిమాతో హిట్ కొట్టిన అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో తెలుగు సినిమా చేసేందుకు కూడా ఆయన అంగీకారం తెలిపాడు.
ఇప్పుడు ఈ హీరోలను మరో తమిళ హీరో సూర్య అనుసరిస్తున్నాడు. సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. సూర్య నేరుగా తెలుగు సినిమాలు చేస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తాడని, ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే అవేవి నిజం కాలేదు.
అయితే తాజాగా సూర్య ఓ తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. తెలుగులో గోపీచంద్ శంఖం, శౌర్యం వంటి సినిమాలు తీసిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. శౌర్యం తర్వాత శివ తమిళ అగ్ర హీరో అజిత్ తో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. అతడు సూర్య సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం సూర్య బాల దర్శకత్వంలో అచలుడు, వెట్రిమారన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే సూర్య- శివ కాంబినేషన్లో తెలుగు సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.