సౌతిండియా సినిమా రాజధాని అవుతుందా?
2023 లో దక్షిణ భారత సినిమా రంగం ఆదాయం రూ. 7,763 కోట్లకు చేరుకోవచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది.
2023 లో దక్షిణ భారత సినిమా రంగం ఆదాయం రూ. 7,763 కోట్లకు చేరుకోవచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. పాన్-ఇండియా సినిమా హిట్‌లు లేనట్లయితే, సీఐఐ నివేదిక ప్రకారం దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం 2022 లో ఆర్జించిన రూ.7,836 కోట్ల నుంచి 2023లో 1 శాతం తగ్గుతుంది. 2023లో తమిళ సినిమాల ఆదాయం మాత్రం 15 శాతం పెరుగుతుంది. 2022 లో తమిళ సినిమాల ఆదాయం రూ. 2,950 కోట్లు వుంది. 2023 లో ఇది పెరిగి రూ. 3,400 కోట్లకు చేరుకుంటుందని సీఐఐ అభిప్రాయపడింది. అదే తెలుగు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం 2022 లో రూ. 2,500 కోట్లు వుండగా, ఇది 2023 లో 5 శాతం స్వల్ప పెరుగుదలతో రూ.2,630 కోట్లకు చేరుకోవచ్చని నివేదికలో తెలిపింది. .
ఇదిలా వుంటే, 2022 లో రూ. 816 కోట్లు వున్న మలయాళ సినిమాల ఆదాయం 11 శాతం పెరిగి 2023 లో రూ. 908 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇదే కన్నడ సినిమాల విషయంలో ఆందోళనకరంగా వుంది. 2022లో రూ. 1,570 కోట్లుగా వున్న కన్నడ సినిమాల ఆదాయం, 2023 లో రూ. 825 కోట్లకు పడిపోతోందని అంచనా కట్టింది. ఈ సంవత్సరం కన్నడ నుంచి మెగా సినిమాలు, పానిండియా సినిమాలు లేనందున ఆదాయంలో ఈ కోత పడుతోంది.
సౌత్ నుంచే జీఎస్టీ ఎక్కువ
గత సంవత్సరం 4 భాషల్లో దక్షిణ భారత సినిమాలు రూ. 7,800 కోట్ల ఆదాయం ఆర్జించాయి. ఇది మొత్తం దేశ భాషల సినిమాలన్నీ కలిపి ఆర్జించిన ఆదాయంలో 52 శాతం. అంటే సగానికి పైగా సినిమాలపై జీఎస్టీ సౌత్ సినిమాల నుంచే వెళ్తోంది.
థియేటర్ల విషయానికొస్తే, 2022 లో దేశంలో 8,700 స్క్రీన్‌లు వున్నాయని నివేదిక పేర్కొంది. వీటిలో 4,216 అంటే సుమారు సగం దేశంలోని ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే వున్నాయి. అంటే ప్రతి మిలియన్ జనాభాకు 16 స్క్రీన్లు. ఇది చాలా తక్కువ. ప్రతి మిలియన్ జనాభాకు 20 స్క్రీన్లు చొప్పున 5,500 థియేటర్లు వుండాలి. అంటే ఇంకో 1284 థియేటర్లు పెరగాలని సీఐఐ సూచన. థియేటర్ల పెరుగుదల ఆదాయ పెరుగుదల కానుందా అన్నది ప్రశ్నే. నేటి మల్టీప్లెక్సుల మార్కెట్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎవరూ నిర్మించరు. మల్టీప్లెక్స్ కార్పొరేట్లే మల్టీప్లెక్సులు పెంచాలి. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకుంటాయి. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే 5 దక్షిణ రాష్ట్రాలే సినిమాల పరంగా శక్తివంతమైన ఆర్ధిక కూడలిగా వున్నాయని నివేదికల్ని బట్టి అర్ధమవుతోంది. ఇక సౌతిండియాని దేశ సినిమా రాజధానిగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఈ కింది నివేదికని బట్టి కూడా అర్ధమవుతోంది.
దక్షిణ ఆధిపత్యం
ఒర్మాక్స్ మీడియా రిపోర్టు ప్రకారం, 2022 లో భారతీయ స్థూల బాక్సాఫీసు ఆర్జన రూ. 10, 637 కోట్లుగా వుంది. ఇది 2019 కంటే కేవలం రూ. 300 కోట్లు తక్కువ. దీంతో 2022 వార్షికం ఉత్తమ వసూళ్ళు సాధించిన సంవత్సరంగా నిలిచింది. కానీ 2019 తో పోలిస్తే 2022లో బాక్సాఫీసులో గణనీయమైన మార్పు కనిపించింది. 2022 లో, హిందీ బాక్సాఫీసు వాటా 44 శాతం నుంచి శాతానికి తగ్గుముఖం పట్టింది. అదే తెలుగు బాక్సాఫీసు పైకి ఎగబ్రాకి 13 శాతం నుంచి 20 శాతం వృధ్ధి కనబర్చింది. నాలుగు దక్షిణ భాషల సినిమాలు మొత్తం దేశ బాక్సాఫీసులో 50 శాతం ఆదాయాన్ని అందించాయి. ఇందులో తమిళం వాటా 16 శాతం, కన్నడ వాటా 8 శాతం, మలయాళం వాటా 6 శాతంగా వున్నాయి. 50 శాతం వాటా దక్షిణాదిది అవుతున్నప్పుడు 40 శాతం కూడా లేని బాలీవుడ్ సినిమా రాజధాని ఏమిటి? ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమాలేనని ప్రపంచ గుర్తింపు దేనికి? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాలీవుడ్ ని యూపీకి తరలించుకు పోవాలని ఉవ్వీళ్ళూరుతున్నాడు. అదేదో జరిగిపోతే బావుణ్ణు.
ఇంకోటేమిటంటే, పైన చెప్పిన 44 శాతం హిందీ బాక్సాఫీసు వాటాలో 32 శాతం కేజీఎఫ్ : చాప్టర్ 2, ట్రిపులార్, కాంతారా మొదలైన దక్షిణాది చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌ల నుంచి వచ్చిందే! దక్షిణ సినిమాల పురోగమనం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది- ముఖ్యంగా ట్రేడ్ పండిట్లు దీన్ని అర్ధం జేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి ఎలా చేరుకున్నాం? ఇదే స్థిరపడిపోయే కొత్త ఒరవడి అవుతుందా? లేదా ఇది కాలక్రమేణా నెమ్మదిగా తగ్గుముఖం పట్టే తాత్కాలిక పొంగేనా? ఏదీ తేల్చుకోలేక పోతున్నారు. కానీ ఇది పొంగు కాదు, హంగు. రెండు దశాబ్దాల నాటినుంచీ పునాదులు పడుతూ వచ్చిన ఒక వాస్తవం. దక్షిణ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి వివిధ టీవీ ఛానెళ్ల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంటింటికీ అలవాటు చేసిన దక్షిణ సినిమాల మాస్ రుచి. ఈ దృఢ పునాదుల మీద ఇవ్వాళ సౌత్ సినిమాలు దేశీయ సినిమా రంగాలు మొత్తాన్నీ శాసిస్తున్నాయి. పక్క దేశంలో కూడా పాపులర్ అవుతున్నాయి.