ఓటీటీల నుంచి ఏం నేర్చుకోవాలి సినిమా రంగం
మన దేశంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) సంస్థలు కంటెంట్ ప్రొడక్షన్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సినిమాల హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ని కొనేస్తున్నాయి.
మన దేశంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) సంస్థలు కంటెంట్ ప్రొడక్షన్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సినిమాల హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ని కొనేస్తున్నాయి. ఓటీటీ సంస్థలు సినిమా రంగంపై ఆధారపడ్డప్పటికీ, సినిమారంగం ఎదుర్కొనే ఒడిదుడుకులు వీటిని ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదు. హిట్ సినిమాలు తగ్గడం వల్ల సినిమా థియేటర్లే, కొన్ని మల్టీప్లెక్సులే మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పై పెచ్చు నష్టాల్లో వున్న సినిమా రంగాలకి ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చే పెద్దన్న హోదా ఓటీటీలు వెలగబెడుతున్నాయి.
గత ఏప్రెల్‌లో, ప్రాంతీయ భాషలైన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 40కి పైగా కొత్త సిరీస్ ని, సినిమాల్నీ ప్రారంభించనున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ 2019 - 20లో కంటెంట్‌పై 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సోనీలివ్ 2023లో ప్రాంతీయ భాషల కంటెంట్ పై దృష్టి పెట్టింది. 2022 లో దేశంలో ఆన్‌లైన్ వీడియో కంటెంట్ పై పెట్టుబడి 1.3 బిలియన్ డాలర్లుగా వుంటే, 2027 నాటికి ఇది పెరిగి 4.2 బిలియన్ డాలర్లకి చేరుకోగలదని అంచనా వేశారు.
సోనీ పిక్చర్స్ టెలివిజన్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, దేశీయ మార్కెట్‌లో ఆంగ్ల భాషా కంటెంట్ వినియోగం విస్తారంగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణేలు సహా దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో సర్వే నిర్వహించారు. 15 ఏళ్లు పైబడిన వారిని సర్వే చేశారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ కూడా అంతర్జాతీయ ఆంగ్ల కంటెంట్ చూస్తున్న భారతీయుల సంఖ్య మహమ్మారికి ముందు 19.1 మిలియన్ల నుంచి ప్రస్తుతం 85 మిలియన్లకి పెరిగిందని, ఇది 124 శాతం పెరుగుదలని ప్రతిబింబిస్తోందనీ నివేదికలో పేర్కొంది. ఇందులో 42.7 మిలియన్ల మంది ఎస్వీ ఓడీ (సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్) చందాదారులు, 42.5 మిలియన్ల మండి ఏవీఓడీ (అడ్వర్ టైజింగ్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్) చందాదారులు వున్నారు. 42.7 మిలియన్ల ఎస్వీ ఓడీ చందాదారుల్లో 65 శాతం మంది ఆంగ్ల కంటెంట్‌ని వినియోగించారని, వీరు మెట్రోపాలిటన్ నగరాలు, చిన్న నగరాలు పట్టణాలలో విస్తరించి వున్నారనీ ఓర్మాక్స్ తెలిపింది.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసిద్ధ అంతర్జాతీయ షోల డబ్బింగ్ వెర్షన్‌ల లభ్యత అనేది , మన దేశంలోని ఆంగ్ల భాషా ఉపగ్రహ టీవీ ఛానెళ్ళలో వాస్తవానికి అందుబాటులో లేని కారణంగా, వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహమ్మారి సమయంలో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని ప్రయత్నించడానికి మరింత ఓపెన్‌గా మారినప్పుడు ఈ ట్రెండ్ ప్రారంభమైంది. డబ్బింగ్ లేదా సబ్ టైటిల్స్ తో ఆంగ్ల కంటెంట్ తోబాటు, ఇతర విదేశీ భాషలలో కూడా కంటెంట్ అందుబాటులో వుండడంతో ట్రెండ్ వూపందుకుంది.
ఇంకోటేమిటంటే, మహమ్మారి లాక్‌డౌన్‌ల కాలంలో కొరియన్ కంటెంట్ కి కూడా భారీ జనాదరణ లభించడం ఒక ప్రధాన పరిణామం. దీని ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అనేక రకాల కొరియన్ డ్రామాలతో బాటు, రియాలిటీ షోలనూ, చలనచిత్రాలనూ వాటి ఇండియన్ యాప్‌లలో ప్రదర్శించడం మొదలెట్టాయి.
గత సంవత్సరం ప్రాంతీయ ప్లేయర్ అయిన ఆహా (తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్) హాంకాంగ్ ఆధారిత 04 మీడియాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, 100 గంటల కొరియన్ డ్రామాలు, చలనచిత్రాలు, సంగీతం ప్రసార హక్కుల్ని పొందింది.
ఇక ఎస్ ఎఫ్ వీ (షార్ట్ ఫామ్ వీడియో) –అంటే కొన్ని సెకన్ల నుంచి పది నిమిషాల లోపు నిడివిగల వీడియోలు అనే కొత్త వేదిక పాపులర్ అవడంతో, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజాలు దీన్ని కూడా వదలడం లేదు. జనాదరణ పొందిన షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా రాబోయే తమ కంటెంట్ ని ప్రచారం చేస్తున్నాయి. తాజా వీక్షకుల ట్రెండ్‌లు, సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌ల గురించి ఇంటర్వ్యూలు, కంటెంట్ క్లిప్‌లు, స్ట్రీమింగ్ టైటిల్స్ లోని తారాగణం సభ్యులతో విభిన్న వినోద కామెంటరీలు వైరల్ చేస్తున్నాయి. ఇది మార్కెట్‌లో ప్లాట్‌ఫారమ్ బ్రాండ్ అప్పీల్ ని పెంచుతోంది.
సంగ్రహంగా చెప్పాలంటే, మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లు భారతదేశంలో ఓటీటీ స్ట్రీమింగ్ వీడియో సేవలకు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి, ఇది ఓటీటీ మీడియా సేవల రంగంలో వేగవంతమైన వృద్ధికి దారితీసింది. స్వదేశీ ఓటీటీలతో బాటు, గ్లోబల్ ఓటీటీ దిగ్గజాలైన కంపెనీలు అగ్రశ్రేణి కంటెంట్ ని ఉత్పత్తి చేయడంలో, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ మార్కెట్ వాటా కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
కానీ సినిమా పరిశ్రమ మాత్రం కంటెంట్ క్వాలిటీ గురించి, ప్రేక్షకుల్ని పెంచుకోవడం గురించి, అట్టర్ ఫ్లాపు సినిమాలతో థియేటర్లు మూతబడకుండా చూడడం గురించీ, ఎలాటి సర్వేలూ అధ్యయనాలూ బాదరాబందీ లేకుండా, కడుపులో చల్ల కదలకుండా కాలం వెళ్ళబుచ్చుతోంది.