Telugu Global
Cinema & Entertainment

సుజాత లేని శంకర్ భవిష్య‌త్తు ఏమిటీ..?

సుజాత‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఉప‌యోగిస్తున్న ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించిన వాళ్ల‌లో ఒక‌డు. త‌మిళం నుంచి వ‌చ్చిన సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థ‌లు అందించిన‌వాడు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి.

సుజాత లేని శంకర్ భవిష్య‌త్తు ఏమిటీ..?
X

అది లాక్ డౌన్ సమయం. చెన్నైలో దర్శకుడు శంకర్ తోటి దర్శకులతో అనేక జూమ్ కాల్ సెషన్స్ ని ప్రారంభించాడు. ఆ దర్శకుల్లో మణిరత్నం, లింగుసామి, కార్తీక్ సుబ్బరాజ్ కూడా వున్నారు. ఆ మాటామంతీ జరుగుతున్నప్పుడు శంకర్ ఒకటి అడిగాడు : తను దర్శకత్వం వహించడానికి తగ్గ కథ ఎవరి దగ్గరైనా వుందాని. వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. తను చాలా సంవత్సరాల క్రితం ఒక రాజకీయ కథ రాసుకున్నాడు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాలా కాలం క్రితం భావించాడు. ఆ కథ శంకర్ కి చెప్పడంతో వెంటనే ఓకే చేశాడు శంకర్. ఆ కథే రాంచరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో 'ఆర్సీ 15' (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కుతోంది.

2012 లో శంకర్ హిందీ 'త్రీ ఇడియెట్స్' ని రీమేక్ చేశాడు 'స్నేహితుడు' గా. ఇది ఫ్లాపయ్యింది. ఆ తర్వాత 'ఐ' తీశాడు. డిఫరెంట్‌గా ట్రై చేసినా ఇది కూడా డిజాస్టర్‌గా మారింది. ఆ భారీ పరాజయం తర్వాత శంకర్ సీక్వెల్స్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే 2018 లో 'రోబో' కి సీక్వెల్‌గా '2.0' తీశాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆర్థిక వైఫల్యంగా మిగిలిపోయింది. ఇక 2019 లో కమల్ హాసన్‌తో కలిసి 'భారతీయుడు' సీక్వెల్ 'ఇండియన్ 2' ప్రారంభించాడు. ఇది అనేక సమస్యలతో, వివాదాలతో ఇంకా పూర్తి కాలేదు.

ఇలా వుండగా, 'అపరిచితుడు' ని రణవీర్ సింగ్ తో హీందీలో రీమేక్ చేద్దామని ప్రయత్నించాడు. దాని ఒరిజినల్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో కాపీరైట్ వివాదంతో కోర్టులో పడింది. పైగా ఆస్కార్ రవిచంద్రన్ 'అపరిచితుడు' ని శంకర్ కంటే భారీ యెత్తున హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీయబోతున్నట్టు ప్రకటించాడు.

ఇక రాంచరణ్ తో తీస్తున్న 'ఆర్సీ 15' గతంలో తానే తీసిన 'ఒకే ఒక్కడు' తరహా కథ. ముఖ్యమంత్రిపై పోరాడే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తాడు. ఈ కథ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ లు తన కథ నుంచి కాపీ కొట్టేశారని చిన్నస్వామి అనే నిర్మాత కంప్లెయింట్ చేశాడు.

పైనుంచీ కిందివరకూ, ఇదంతా చూస్తూంటే శంకర్ పరిస్థితి గందరగోళమని అన్పిస్తోంది కదూ? మామూలు గందరగోళం కాదు. తీసిన సినిమాలకే రీమేకులు, తీసిన సినిమాలకే సీక్వెల్సులు దగ్గర్నుంచీ, 'నేను దర్శకత్వం వహించడానికి తగిన కథ వుందా' అని అడిగేవరకూ, ఇంకా కథల కాపీ వివాదాలు చుట్టుముట్టడం వరకూ అంతా గందరగోళమే. ఇది చాలనట్టు 'ఆర్సీ 15' లో రాంచరణ్ ని ఇంకెలా గ్రాండ్ గా చూపించాలన్న సమస్య ఒకటి. ఎంత గ్రాండ్ గా చూపించాలో అంత గ్రాండ్ గానూ 'ఆర్ ఆర్ ఆర్' లో ఎస్ ఎస్ రాజమౌళి చూపించేశాక, తనకి ఇంకేం మిగిలినట్టు?

దేశంలో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న శంకర్ కి ఒకేసారి ఇన్ని సమస్యలు, సవాళ్ళు దేనికి? 2012 కి పూర్వం లేవే? అప్పుడంతా పట్టిందల్లా బంగారమే. రోబో, శివాజీ, అపరిచితుడు, బాయ్స్, ఒకే ఒక్కడు, జీన్స్, భారతీయుడు, ప్రేమికుడు, జంటిల్ మన్...అన్నీ అలా అలా బ్రహ్మాండమైన హిట్సే. కథల కొరతలేదు, సమస్యల్లేవు, వివాదాల్లేవు. ఏ కథ పట్టినా హిట్ కొట్టడమే. అలాటిది 2012 నుంచి ఈ రెండు దశాబ్దాలు ఎందుకు కథల సమస్యలో పడ్డాడు?

తన విజయవంతమైన సినిమాల రహస్యమేమిటి? దీని వెనుక హస్తం ఎవరిది? ఆ హస్తం రచయిత సుజాత లేకపోయేసరికి ఈ పరిస్థితా? 1993 లో 'జంటిల్ మన్' నుంచీ రచయిత సుజాతా రంగరాజనే శంకర్ సినిమాలకి క్రియేటివ్ అండ. జంటిల్ మన్ నుంచీ రోబో వరకూ రచయిత సుజాతతో కలిసి జైత్ర యాత్ర. సుజాత రచన శంకర్ సినిమాలకి బలం, బాక్సాఫీసు విజయం. అతను రాసే డైలాగులు సరళమైనవే అయినప్పటికీ ప్రభావవంతమైనవి.

సుజాత తన జీవితకాలంలో పొందిన ప్రజాదరణ తమిళంలో ఆధునిక రచయితలు కొందరే పొందారు. ఇంజనీర్‌గా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు తను. నవలా రచయితగా ప్రారంభంలో తన ప్రధాన ఇతివృత్తం స్త్రీ-పురుషుల సంబంధమే. తర్వాత తమిళంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత తానే అయ్యాడు.

రజనీకాంత్ నటించిన 'గాయత్రి', 'ప్రియ` వంటి సినిమాలు డెబ్బైల నాటికే సుజాత నవలల ఆధారంగా వచ్చాయి. తర్వాత ఎనభైల మధ్యలో, కమల్ హాసన్ తో సూపర్‌కాప్ థ్రిల్లర్ 'విక్రమ్‌' కథ సుజాతదే. దీనికి సీక్వెల్ గా కమల్ 'విక్రమ్' నిర్మించి ఇటీవల ఆలిండియా హిట్ సాధించారు. సుజాత ఆ తర్వాత మణి రత్నంతో 'రోజా`, 'దొంగా దొంగా' 'అమృత' సినిమాలకి చాలా ఫలవంతమైన కథా సహకారాన్ని అందించాడు.

దర్శకుడు శంకర్‌కి వెన్నెముకగా నిలిచిన సుజాత 2010 లో కన్నుమూశాడు. 'రోబో' తను రాసిన చివరి మూవీ. ఆ తర్వాత నుంచి శంకర్ అనాధ అయిపోయాడు. శంకర్ స్వయంగా కథల్ని సృష్టించలేడు. ఐడియాలు మాత్రం చెప్పి సుజాతతో రాయించుకునేవాడు. సుజాత లేకపోయాక, తన ఐడియాలు కూడా నిండుకున్నట్టున్నాయి- తీసిన తన సినిమాలకి సీక్వెల్స్ తీయడం మొదలెట్టాడు. లేదా రీమేక్ చేయడం మొదలెట్టాడు. సుజాత వంటి రచయిత స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేనప్పటికీ, శంకర్‌తో పాటు ఇతర ప్రతిభావంతులైన రచయితలు సుజాత వదిలిపెట్టిన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు మాత్రం అనుకూలంగా రావడం లేదు.

ఈ సంక్షోభం శంకర్ కి గొడ్డలి పెట్టు వంటింది. సౌత్ నుంచి పానిండియా సినిమాలు వెళ్ళి నార్త్ లో దండయాత్ర చేస్తూంటే, తను ఈ పదేళ్ళలో మూడు వరస ఫ్లాపులు తీసి, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుని వెనుకబడిపోవడం విచారకరం. ఇప్పుడు 'ఆర్సీ 15' లో రాంచరణ్ ఎమోషన్స్ సరిగా ప్రకటించడం లేదని, రాంచరణ్ తో తను ఈ సినిమా తీస్తూ తప్పు చేస్తున్నానా అన్న సందిగ్ధంలో పడడం చూస్తే- శంకర్ భవితవ్యం ఏమిటా అన్పిస్తుంది.

First Published:  7 Sept 2022 9:30 AM IST
Next Story