లిప్ కిస్ వివాదంపై ఉదిత్ ఏమన్నారంటే?
అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేస్తూనే ఈ విధంగా చేశానన్న బాలీవుడ్ సింగర్
రామ్మా చిలకమ్మా, చెప్పవే చిరుగాలి, చల్లగా ఎద గిల్లి, అందమైన ప్రేమరాణి, అందాల ఆడబొమ్మ వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ప్రముఖ బాలీవుడ్ సింగ్ ఉదిత్ నారాయణ్ లిప్ కిస్ వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల కిందట ఆయన లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. తన కెరీర్‌లో పేరు తెచ్చిపెట్టిన అనేక పాటలు అందులో పాడారు. 'మోహ్ర'లోని టిప్ టిప్ బర్ సా పాట పాడుతున్న సమయంలో కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటో తీసుకోవడానికి ఆసక్తి చూపెట్టారు. ఈ క్రమంలోనే ఒక మహిళా అభిమాని ఉదిత్‌కు చెంపపై కిస్ ఇవ్వగా ఉదిత్ ఏకంగా ఆమెకు లిప్ కిస్ ఇచ్చారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అనుమతి లేకుండా అలా ఎలా ముద్దు పెడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఉదిత్‌కు ఇదేమీ కొత్తమీ కాదని ఇంతకు ముందు కూడా.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్‌లకు ఇలానే చెంప మీద ముద్దు పెట్టాడని గుర్తు చేస్తున్నారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ముద్దు వివాదంపై ఉదిత్ నారాయణ స్పందించారు. ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేస్తూనే ఈ విధంగా చేశానన్నారు. నా ఫాన్స్‌కు నేనంటే చాలా ఇష్టం. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి వారు ఎంతగానో యత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే కొంతమంది షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చూస్తారు. మరికొంతమంది ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది ఆత్మీయతతో కూడుకున్న విషయం మాత్రమే. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. వారితో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. మాకు సమాజంలో మంచి పేరున్నది. వివాదాలకు దూరంగా ఉంటాం. కొంతమంది కావాలనే దీన్ని వివాదంగా చూస్తున్నారని ఉదిత్ అన్నారు.