Telugu Global
Cinema & Entertainment

Kaathal The Core Movie: మమ్ముట్టి - జ్యోతిక నటించిన ‘కాథల్- ది కోర్’ పై రివ్యూలేమంటున్నాయి?

Kaathal The Core Movie: మమ్ముట్టి, జ్యోతికలు నటించిన ‘కాథల్- ది కోర్’ నవంబర్ 23 న విడుదలైంది. విడుదలకి ముందే రెండు గల్ఫ్ దేశాలు కువైట్, ఖతర్ లు దీన్ని నిషేధించడం చర్చనీయాంశమైంది.

Kaathal The Core Movie: మమ్ముట్టి - జ్యోతిక నటించిన ‘కాథల్- ది కోర్’ పై రివ్యూలేమంటున్నాయి?
X

మమ్ముట్టి, జ్యోతికలు నటించిన ‘కాథల్- ది కోర్’ నవంబర్ 23 న విడుదలైంది. విడుదలకి ముందే రెండు గల్ఫ్ దేశాలు కువైట్, ఖతర్ లు దీన్ని నిషేధించడం చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియాలో కూడా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని తెలుస్తోంది. కువైట్, ఖతర్ దేశాల సెన్సార్ బోర్డులు ప్రస్తుతానికైతే నిషేధించాయి గానీ, కొన్ని కత్తిరింపులతో ఆమోదించే అవకాశముంది. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కంపైనే వుండొచ్చుగానీ, స్వలింగ సంపర్కాన్ని దృశ్యపరంగా చూపించలేదనీ, కేవలం సంభాషణల పరంగా వెర్బల్ గానే విషయం చెప్తుందనీ సినిమాపై వెలువడ్డ రివ్యూలు చెబుతున్నాయి.

కెరీర్ చివరి దశలో వున్న మమ్ముట్టి లాంటి మెగాస్టార్ విభిన్న కథలతో ముందుకొస్తూ తనని తాను ఆవిష్కరించుకుంటున్నారంటే సినిమాపై ఆయనకున్న మక్కువ అర్థమవుతుంది. సెప్టెంబర్ లోనే 72 ఏళ్ళ వయసులో నటుడిగా, నిర్మాతగా రూపొందించిన ‘కన్నూర్ స్క్వాడ్’ విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఇంతలోనే నటుడిగా, నిర్మాతగా ‘కాథల్ -ది కోర్’ వచ్చేసింది. దీనిపై ప్రముఖ పత్రికల రివ్యూలు వచ్చేశాయి. మలయాళ మనోరమ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికలు గరిష్టంగా 4/5 రేటింగ్ తో సినిమాని ప్రశంసిస్తూ రివ్యూలు రాశాయి. వీటి సారాంశం ఈ క్రింద చూద్దాం.

కథ చూస్తే, కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణానికి సమీపంలోని టీకోయ్ అనే విచిత్రమైన గ్రామం. మాథ్యూ దేవస్సీ (మమ్ముట్టి) ఓమన (జ్యోతిక) అనే మధ్య వయస్కులైన జంట చుట్టూ ఈ కథ కేంద్రీకృతమై వుంటుంది. వీళ్ళ 19 ఏళ్ళ ఫెమీ (అనఘా మాయా రవి) డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో వుంటుంది. వామపక్ష పార్టీకి చెందిన మాథ్యూ సహకార శాఖలో పనిచేసి రిటైరయ్యాడు. పార్టీ అతడ్ని పంచాయతీలోని ఒక వార్డుకి జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని కోరుతుంది. అయితే మాథ్యూ నామినేషన్ వేసి ప్రచారం ప్రారంభించగానే, ఓమన విడాకుల కోసం కేసు దాఖలు చేస్తుంది.

ఇది మాథ్యూని, ఇతరుల్ని షాక్‌ కి గురి చేస్తుంది. ఓమన విడాకులు కోరడానికి కారణం అతను హోమో సెక్సువల్ కావడమని చెప్తుంది. కారు డ్రైవర్ థంకన్‌తో చాలా కాలంగా సంబంధాలు వున్నాయనీ ఆరోపిస్తుంది. ఈ విడాకులతో తను భరణాన్ని కోరడం లేదు, గృహ హింసకి సంబంధించిన ఉదంతాల్నికూడా పేర్కొనలేదు. కేవలం ఈ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని మాత్రమే కోరుకుంటోంది.

ఈ మలుపుతో తీవ్రంగా బాధపడతాడు మాథ్యూ. ఇప్పుడతను భార్య చేసిన ఆరోపణని తిరస్కరిస్తాడా? తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికే ఓమన ఇలా చేస్తోందా? ఓమనకి విడాకులు మంజూరవుతాయా? ఏం జరుగుతుంది?...ఇదీ మిగతా కథ.

విశ్లేషిస్తే, 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'తో దర్శకుడిగా నిరూపించుకున్న బేబీ జో ‘కా థల్‌-ది కోర్‌'తో ఇంకో మెట్టు ఎక్కాడు. దేశం చట్టబద్ధం చేసినప్పటికీ ఇప్పటికీ నిషిద్ధ అంశంగా సమాజంలో స్థిరపడ్డ స్వలింగ సంపర్కం అంశంపై సినిమా తీయడం సాహసోపేత చర్యే. అయితే ఇలాటి అంశంతో సినిమా వచ్చేసి LGBTQIA+ హక్కుల కోసం సున్నితత్వంతో వాదించినప్పుడు ఎవరూ అఫెండ్ అయ్యే అవకాశముండదు. పైగా మమ్ముట్టి వంటి సూపర్ స్టార్ దీనిని 2023 ఉత్తమ చలన చిత్రాల్లోఒకటిగా మార్చాలన్న ధ్యేయంతో వున్నప్పుడు చవకబారుతనం చొరబడదు. ఈ సినిమా కోర్టులు, చట్టాలు ఎలా పని చేస్తాయి, సమాజం - రాజకీయం -చర్చి- కుటుంబం వరకూ మార్పుకి ఎంతవరకూ సిద్ధంగా వున్నాయీ, ప్రతి ఒక్కరికీ పరమ సత్యం ఎలా విముక్తి కలిగిస్తుందీ అన్నవి పరిశీలిస్తుంది.

సెక్షన్ 377 ని కొట్టివేయడం ద్వారా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే వీలు లేనప్పటికీ, స్వలింగ వివాహాలు ఇంకా చట్టబద్ధం కానప్పటికీ, సామాజిక దురభిప్రాయాలు కొనసాగుతూనే వున్నాయి. ఫలితంగా స్వలింగ సంపర్కుల జీవితాలకి అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యని కూడా శక్తివంతమైన శైలిలో ప్రస్తావిస్తుందీ సినిమా.

సెకండాఫ్‌లో సినిమా కోర్టు రూమ్ డ్రామాగా మారుతుంది. ఈ పాత్రలు ఒకరి పోరాటాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంతో మనల్ని ఏడిపిస్తాయి. ఈ సినిమా మార్గనిర్దేశనం చేసే పదునైన, విప్లవాత్మక వ్యాఖ్యానం. స్వలింగ సంపర్కం, దాని పట్ల అంగీకారంపై సరైన లెన్స్ ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం. సమాజంలో తమకు నచ్చిన రీతిలో వుండడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఇది చూపిస్తుంది. తారాగణం ప్రదర్శించిన అత్యుత్తమ నటనల కారణంగా 'కాథల్ - ది కోర్' అందమైన దృశ్యకావ్యమైంది. ఈ వయస్సులో ఈ పాత్రని పోషించినందుకు, నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపినందుకూ మమ్ముట్టికి పూర్తి క్రెడిట్ దక్కుతుంది. జ్యోతిక అన్నీ కళ్ళతోనే మాట్లాడుతూ నటించింది. ముగింపులో మమ్ముట్టి, జ్యోతికల ల మధ్య జరిగే సీక్వెన్స్ ని చూడాలంటే జేబులో కర్చీఫ్ సిద్ధంగా వుంచుకోవాల్సిందే.

నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా బలంగా వుం ది. సాలూ కె థామస్ ఛాయాగ్రహణమైనా, ఫ్రాన్సిస్ లూయిస్ ఎడిటింగ్ అయినా అత్యుత్తమంగా వున్నాయి. లలితంగా వున్న మాథ్యూ పులికన్ సంగీతం మనల్ని కదిలించకపోతే ఇది సినిమా కానేకాదు. చివరి షాట్ లో LGBTQIA+ సభ్యులందరికీ సినిమాని అంకితం చేశారు. మంచి సినిమాలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయని, మార్పుకి నాంది పలుకుతాయినీ తేల్చి చెబుతుందీ చలన చిత్రం.

First Published:  24 Nov 2023 11:15 AM IST
Next Story