Vyooham Movie | రామ్ గోపాల్ వర్మ సినిమా వాయిదా
Vyooham Movie - రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా మరోసారి వాయిదా పడింది. ఈసారి కొత్త విడుదల తేదీ మార్చి 1.
లెక్కప్రకారం, ఈ పాటికి థియేటర్లలోకి రావాలి వ్యూహం సినిమా. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. తమ సినిమా వాయిదా పడినట్టు స్వయంగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.
"వ్యూహం సినిమా మార్చి 1కి, శపథం సినిమా మార్చి 8కి పోస్ట్ పోన్ అవుతున్నాయి.. అయితే ఈసారి కారణం లోకేష్ కాదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సినిమాల్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి ప్రచారం చేయడానికి మరింత సమయం దొరికింది. పైగా మేం కోరుకున్న థియేటర్లు కూడా దొరకబోతున్నాయి."
ఇలా తమ సినిమాలు వాయిదా అవుతున్న విషయాన్ని బయటపెట్టాడు వర్మ. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ఇంకా సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల మధ్య వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏ నిమిషంలోనైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చు. వ్యూహం సినిమా విడుదల టైమ్ కు కోడ్ అమల్లోకి వస్తే, ఈ సినిమాకు మరోసారి చిక్కులు తప్పకపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని, అతడు ఎదిగిన విధానాన్ని చూపిస్తూ వ్యూహం-శపథం సినిమాలు తీశాడు వర్మ. అదే టైమ్ లో తన సినిమాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పాత్రల్ని కూడా పెట్టాడు. దీంతో ఈ మూవీ వివాదాస్పదమైంది. కోర్టు కేసుల అనంతరం విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే ఇప్పటికీ ఈ సినిమాను టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాడు. సినిమాను రివ్యూ చేసిన ప్రత్యేక కమిటీ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్లు క్లియర్ చేస్తే తప్ప సెన్సార్ సర్టిఫికేట్ రాదు.