Vishwak Sen: దాస్ కా దమ్కీ ట్రయిలర్ రివ్యూ
Vishwak Sen's Das ka Dhamki: దాస్ కా ధమ్కీ సినిమాను తెరకెక్కించాడు విశ్వక్ సేన్. ఈ సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత అన్నీ అతడే. తాజాగా ట్రయిలర్ లాంచ్ చేశారు.
ఓరి దేవుడా హంగామా ముగిసింది. ఇప్పుడు ధమ్మీ సినిమా మీద పడ్డాడు విశ్వక్ సేన్. తాజాగా 'దాస్ కా ధమ్కీ' ట్రయిలర్ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. విశ్వక్ సేన్ 10 వేలకోట్ల టర్నోవర్ గల ఇండస్ట్రీ ధనికుడిగా, వెయిటర్ గా ద్విపాత్రాభినయంలో కనిపించాడు. ధనికుడి మరణం తరువాత, అతని కంపెనీ, కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వెయిటరైన విశ్వక్ ని.. కంపెనీ, కుటుంబం బాధ్యత తీసుకోవాలని రావు రమేష్ కోరతాడు. ధనవంతుడు నిజంగా చనిపోయాడా? కంపెనీని, విశ్వక్ కుటుంబాన్ని కుప్పకూల్చేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? అనేది ట్రయిలర్ లో ఆసక్తికరగా చూపించారు
కథాంశం కొత్తగా లేకపోయినా, ఇప్పటివరకు విశ్వక్ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఇతడే. కామెడీ, రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్, ఎమోషన్స్ , డ్రామా ఇలా అన్నీ కనిపించేలా ట్రయిలర్ కట్ చేశారు.
విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశాడు. నివేదా పెతురాజ్ గ్లామర్ గా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాత కూడా విశ్వక్ సేనే. కాకపోతే ప్రొడ్యూసర్ గా తండ్రి పేరు పడుతుంది.
ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా మూవీ ఇది.