అందుకే ఈ సినిమా లేట్ అయింది
విశ్వక్ సేన్ తాజా చిత్రం ఓరి దేవుడా. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. నిజానికి ఇది ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు. ఈ మూవీ ఎందుకు లేట్ అయిందో చెప్పాడు విశ్వక్.
విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఓరి దేవుడా. నిజానికి ఇది తాజా చిత్రం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే, రెండేళ్ల కిందటే రావాల్సిన సినిమా. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందే రావాల్సిన సినిమా ఇది. కానీ లేట్ అయింది. ఈ లేట్ కు ఓ కారణం కరోనా అయితే, మరో ముఖ్యమైన కారణం ఇంకోటి ఉందంటున్నాడు నటుడు విశ్వక్ సేన్.
"పీవీపీ సినిమా బ్యానర్ పై 'ఓ మై కడవులే' సినిమాను రీమేక్ చేస్తున్నాం.. మిమ్మల్ని హీరోగా అనుకుంటున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి చెప్పారు. అశ్వత్ మారిముత్తునే డైరెక్టర్ అని చెప్పగానే వెంటనే ఒకే చేసేశాను. 2020లో అశోకవనంలో అర్జున కళ్యాణం కంటే ముందే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. కానీ దేవుడి పాత్ర కోసం కొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. అలాగే ఒక ఫ్యామిలీ సినిమా తర్వాతే ఓరి దేవుడా సినిమా థియేటర్స్ లోకి వస్తే బాగుంటుందని భావించాను. అందుకే అశోకవనంలో అర్జున కళ్యాణం ముందుగా రిలీజ్ చేసి, ఆ తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాను. అందుకే ఇది లేట్ అయింది."
ఇలా ఓరి దేవుడా లేట్ వెనక రీజన్ బయటపెట్టాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్ర కోసం ముందుగా వెంకటేష్ నే అనుకున్నారట. అయితే ఆ తర్వాత మరో ఇద్దరి పేర్లు అనుకున్నప్పటికీ, ఫైనల్ గా తిరిగి వెంకటేష్ నే తీసుకున్నట్టు విశ్వక్ తెలిపాడు.
ఈ సినిమాకు వెంకటేశ్ కేవలం 4 రోజులు వర్క్ చేశారట. ఆ 4 రోజుల వర్క్ ఎక్స్ పీరియన్స్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటున్నాడు విశ్వక్ సేన్. ఈ రోజు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.