Telugu Global
Cinema & Entertainment

18 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో విశాల్!

పురచ్చి దళపతి (విప్లవ దళపతి ) విశాల్ మొత్తానికి 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ సంపాదించాడు.

18 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో విశాల్!
X

పురచ్చి దళపతి (విప్లవ దళపతి ) విశాల్ మొత్తానికి 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ సంపాదించాడు. 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులతో సతమతమైన విశాల్, ‘మార్క్ ఆంథోనీ’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఆశ్చర్యపర్చాడు. హిందీ, ఇంగ్లీషు జాతీయ మీడియాల్లో ప్రధానాకర్షణగా నిలిచాడు. 20 ఏళ్ళ తన కెరీర్ లో ఇంత పెద్ద హిట్ సాధించడం ఇదే. 2005 లో ‘పందెం కోడి’ (సందకోళి) తో మాస్ యాక్షన్ హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుని, తమిళంలో నటించే ప్రతీసినిమా తెలుగులో విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్నాడు. తెలుగు వాడైన విశాల్ మొత్తం 37 సినిమాలు నటించి, అందులో 10 సినిమాల్ని సొంతంగా నిర్మించాడు.

‘పందెం కోడి’ తర్వాత ‘మార్క్ ఆంథోనీ’ హీరోగా అతడి నట జీవితంలో మరో మైలురాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ‘మార్క్ ఆంథోనీ’ సెప్టెంబర్ 15 న విడుదలైంది. అయితే అప్పుడప్పుడే సెప్టెంబర్ 7 న విడుదలైన షారుఖ్ ఖాన్ ‘జవాన్’ జోరుని విశాల్ తట్టుకోగలడా అన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఎందుకంటే, ‘జవాన్’ దర్శకుడు అట్లీ తమిళంలో పేరున్న దర్శకుడు. పైగా ఇందులో నయనతార, ప్రియమణిల వంటి తమిళ, మలయాళ హీరోయిన్లున్నారు. ఇంకా చెప్పుకుంటే తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించాడు. కనుక తమిళ తారాగణ బలంతో తమిళనాడులో బాక్సాఫీసు ముందు ఇంత బలంగా నిలబడ్డ ‘జవాన్’ తమిళ వెర్షన్ ముందు -విశాల్ తట్టుకు నిలబడగలడా అన్న సందేహాలు సహజంగానే వ్యక్తమయ్యాయి.

ఈ సందేహాలన్నిటినీ తుడిచిపెట్టేస్తూ విశాల్ దూసుకుపోయాడు. 18 రోజుల్లో వందకోట్ల బాక్సాఫీసు వసూళ్ళని దాటేశాడు. సెప్టెంబర్ లో 28 తమిళ సినిమాలు విడుదలైనా ‘మార్క్ ఆంథోనీ’ తప్ప పెద్ద సినిమా ఏదీ విడుదల కాలేదు. చిన్న హీరోల చిన్న సినిమాలే విడుదలయ్యాయి. ఇది కూడా బాగా కలిసి వచ్చింది విశాల్ కి. సెప్టెంబర్ 28 న రాఘవ లారెన్స్ నటించిన ‘చంద్రముఖి 2’ విడుదలైనా అది అట్టర్ ఫ్లాపయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన విశాల్ మూవీ, రూ. 19 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకుని సెప్టెంబర్ నాటికి టాప్ లో వున్న తమిళ సినిమాల్లో ఆరోస్థానాన్ని ఆక్రమించింది. మొదటి ఐదు స్థానాలని ‘జైలర్’ (రజనీకాంత్), ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (మణిరత్నం), ‘వారిసు’ (విజయ్), ‘తునివు’ (అజిత్), ‘వాతి’ (ధనుష్) పొందాయి. విశాల్ మూవీ తమిళనాడులో సుమారుగా రూ. 60.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 9.50 కోట్లు, కర్ణాటకలో రూ. 6.25 కోట్లు, కేరళలో దాదాపు రూ. 5 కోట్లు వసూలు చేసింది.

‘మార్క్ ఆంథోనీ’ కి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. 4 సినిమాలకి దర్శకత్వం వహించిన అతడికి ఇదే పెద్ద హిట్. అసలే ఒకే రకమైన మాస్ సినిమాలతో, అందులో 9 వరస ఫ్లాపులతో వున్న విశాల్ సినిమా- అందుకని విడుదలకి ముందు దీనికి బజ్ లేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా బజ్ పెరిగింది. ఆ తర్వాత ఎదురులేకుండా పోయింది. ఇందులో టైమ్ ట్రావెల్ కథ ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల చుట్టూ తిరుగుతుంది. మార్క్ గా, ఆంథోనీగా విశాల్ తండ్రీ కొడుకులుగా నటిస్తే, నటుడుగా మారిన దర్శకుడు ఎస్ జె సూర్య కూడా విలన్ గా తండ్రీ కొడుకుల పాత్రలు పోషించాడు. సినిమా సగం విజయం ఎస్ జె సూర్య కామెడీదే. హీరోయిన్ గా రీతూ వర్మ నటించింది.

సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు

ఇలా వుండగా, విశాల్ సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలతో మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టించిందిది. ఈ వివాదం గత వారం రోజులుగా నలుగుతోంది. ‘మార్క్ ఆంథోనీ’ హిందీ వెర్షన్ సర్టిఫికేషన్ కోసం సెన్సార్ బోర్డుకి రూ. 6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చిందని విశాల్ ఆరోపించాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ విచారణకి ఆదేశించింది. సిబిఐ రంగంలోకి దిగి ముగ్గురు సెన్సార్ బోర్డు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంది. వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ. 6.5 లక్షల్ని సీజ్ చేసింది.

విశాల్ ఆన్‌లైన్ నగదు బదిలీల వివరాలతో సెన్సార్ బోర్డుకి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లని పేర్కొంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేని, ప్రధాని నరేంద్ర మోడీనీ ఉద్దేశించి చేసిన దాదాపు నాలుగు నిమిషాల నిడివి గల వీడియో, కేంద్రంలో వేడి పుట్టించి ఒక సీనియర్ అధికారిని ముంబాయికి పంపేలా చేసింది.

సిబిఐ అధికారులు నిందితులుగా మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎం లుగా గుర్తించి అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో విశాల్ నుంచి రూ. 7 లక్షల లంచం డిమాండ్ చేయడానికి ఈ నిందితులు కొంతమంది పేర్లు తెలియని సిబిఎఫ్‌సి అధికారులతో కలిసి కుట్ర పన్నారని చెప్పారు. విశాల్ కి, నిందితులకి మధ్య తగిన చర్చల తర్వాత మేనగా, రాందాస్, రాజన్‌ల బ్యాంక్ ఖాతాల్లో సిబిఎఫ్‌సి అధికారుల తరపున రూ. 6.54 లక్షలు లంచంగా స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఆ బ్యాంకు ఖాతాల నుంచి తక్షణమే రూ.6.5 లక్షలు విత్‌డ్రా అయ్యాయని, సెప్టెంబర్ 26న సీబీఎఫ్‌సీ సెన్సార్ సర్టిఫికెట్‌ని జారీ చేసిందనీ సిబిఐ అధికారులు తెలిపారు.

సెన్సారింగ్ కోసం ఆన్‌లైన్ సర్టిఫికేషన్ సిస్టమ్ వున్నప్పటికీ, నిర్మాతలు ఇప్పటికీ మధ్యవర్తులు లేదా ఏజెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారని, మానవ జోక్యం లేకుండా డిజిటలీకరణతో, పూర్తి ఆటోమేషన్ ప్రక్రియతో ఆధునీకరించాక మధ్యవర్తుల /ఏజెంట్ల జోక్యం గణనీయంగా తగ్గిందని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో నిర్మాతలు దీన్ని వినిగించుకోక పోవడంతో, పారదర్శకతని, సజావుగా పని చేసే ఉద్దేశ్యాన్నీ దెబ్బతీసి నట్లవుతోందనీ కేంద్రీయ సెన్సార్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

First Published:  9 Oct 2023 2:20 PM IST
Next Story