విజయశాంతి అంత రిస్క్ చేస్తారా?
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో విజయశాంతికి ఓ కీలకమైన రోల్ ఆఫర్ చేశారంట. ఇంతకీ ఈ పాత్రకు ఆమె అంగీకరిస్తుందా? ఆమె పొలిటికల్ కెరీర్ పరిస్థితేంటి?
సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె పోషించిన లెక్చరర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు తర్వాత విజయశాంతి పోషించిన పాత్రకే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె సినిమాలకు దూరమయ్యారు. తన పాత్రకు వెయిట్ ఉండే సినిమాలు మాత్రమే చేయాలని గట్టిగా నిర్ణయించుకొని మరీ సినిమాలకు దూరమయ్యారు.
ఇలాంటి టైమ్ లో విజయశాంతి చుట్టూ ఓ కొత్త పుకారు మొదలైంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో విజయశాంతిని ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారనేది ఆ పుకారు సారాంశం. ఎన్టీఆర్, విజయశాంతి కాంబినేషన్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అటు డైరక్టర్ ప్లేస్ లో కొరటాల ఉన్నాడు కాబట్టి, విజయశాంతి రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనుమానం కలిగించే అంశం ఒకే ఒక్కటి. అదే విజయశాంతి పొలిటికల్ కెరీర్. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. పొలిటికల్ మూమెంట్ ఊపందుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రతి రోజు పరస్పరం విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.
ఇలా రాజకీయ వేడి కొనసాగుతున్న టైమ్ లో పాలిటిక్స్ పక్కనపెట్టి, మరోసారి సినిమాల వైపు విజయశాంతి వస్తారా అనేది అందరి డౌట్. ఈ విషయంలో రెండు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్-కొరటాల పాన్ ఇండియా సినిమా ఆఫర్ వదులుకోవద్దని ఆమె అభిమానులు సూచిస్తుంటే.. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఇంతకంటే మంచి టైమ్ ఉండదని ఆమె రాజకీయ అభిమానులు చెబుతున్నారు. మరి విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?