Vijay Kanakamedala - ఉగ్రంకు అలా నాంది పడింది
Vijay Kanakamedala Ugram Movie - ఉగ్రం మూవీ వెనక నేపథ్యాన్ని, ఈ కథ ఎలా పుట్టిందనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు విజయ్ కనకమేడల.
నాంది సినిమా హిట్టయింది కాబట్టి, ఆ కాంబినేషన్ ను క్యాష్ చేసుకునేందుకు ఉగ్రం సినిమా తీశారని చాలామంది అనుకుంటున్నారు. ఇలా క్రేజీ కాంబినేషన్ ను క్యాష్ చేసుకోవడం సహజం కాబట్టి ఇలా అనుకోవడంలో తప్పులేదు. అయితే దర్శకుడు విజయ్ కనకమేడల మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.
"నాంది సినిమా మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. 6 నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ఉగ్రం కథ చేసుకున్నాను. ఈ కథ నరేష్ గారికి అయితే బావుంటుందనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ పూర్తి రౌద్ర రసంతో చేయలేదు. ఇది ఆయనకి కొత్తగా ఉంటుదనిపించింది. ఆయనకి కథ చెబితే నచ్చింది. తర్వాత కథపై ఆరు నెలలు పరిశోధన చేశాం. నరేష్ గారి ఇట్లు మారేడుమిల్లీ ప్రజానీకం తర్వాత ఉగ్రం మొదలుపెట్టడం జరిగింది."
ఇలా నాంది సినిమా విడుదలకు ముందే ఉగ్రం కథను, హీరోను లాక్ చేసినట్టు ప్రకటించాడు దర్శకుడు. మిస్సింగ్ కేసులపై పరిశోధన చేస్తే చాలా ఆశ్చర్యకర విషయాలు తెలిశాయంటున్నాడు ఈ దర్శకుడు.
"నాంది సమయంలోనే దీనిపై ఆలోచన ఉంది. నిత్యం మిస్సింగ్ వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు కోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా ఉంటుందనేదానిపై కథ చేస్తే బావుంటుదనిపించింది."
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెట్టి నిర్మించారు ఉగ్రం సినిమాని. మే 5న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.