Varalaxmi Sarathkumar: అందుకే విలనిజం ఎంచుకున్నా - సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
Varalaxmi Sarathkumar: తాజాగా విలన్ పాత్రల్లో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. గ్లామర్ పాత్రలు తనకు వర్కవుట్ కావని భావించానని చెప్పారు.

సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
శింబుతో నటించిన తన తొలి చిత్రం `పోడా పోడీ` ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఇప్పుడు విలన్ క్యారెక్టర్లతో దూసుకుపోతోంది. తమిళ, తెలుగు, మలయాళ తదితర భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉంది.
ప్రస్తుతం చేతిలో ఆరు ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె కెరీర్ పీక్స్‌లో ఉంది. సంక్రాంతి బరిలో అలరించేందుకు అభిమానుల ముందుకొస్తున్న బాలకృష్ణ తాజా చిత్రం `వీర సింహారెడ్డి`లోనూ ఆమె విలనిజం ప్రదర్శించారు.
నాయకిగా, ప్రతినాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్ర వచ్చినా వరుసగా చేస్తూ ముందుకు సాగుతున్న వరలక్ష్మీ శరత్‌కుమార్.. తాజాగా విలన్ పాత్రల్లో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. గ్లామర్ పాత్రలు తనకు వర్కవుట్ కావని భావించానని చెప్పారు. అయినా అలాంటి పాత్రలు చేయడానికి చాలా మంది ఉన్నారని తెలిపారు. అందుకే తాను ప్రతినాయక బాటను ఎంచుకున్నానని చెప్పారు.
ప్రతినాయకి ఛాయలున్న కొన్ని పాత్రలను తానే చేయగలనన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ వ్యక్తం చేశారు. తనకు గురువు మాత్రం దర్శకుడు బాల అని వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో `తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్టు వివరించారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న ప్రతినాయకి ఛాయలున్న పాత్రలు తనకు సంతోషాన్ని ఇస్తున్నాయని ఆమె వెల్లడించారు. రవితేజ చిత్రం `క్రాక్`తో ప్రతినాయకి పాత్రలో అలరించిన వరలక్ష్మీ శరత్‌కుమార్.. తాజాగా సంక్రాంతి బరిలోకి వస్తున్న `వీరసింహారెడ్డి`లోనూ అదే స్థాయిలో అలరించనున్నట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.