Vaishnav Tej | మెగా హీరోకు ముచ్చటగా మూడో ఫ్లాప్
Vaishnav Tej - మెగా హీరో వైష్ణవ్ తేజ్ మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది. ఆదికేశవ సినిమా నుంచి అతడు పాఠం నేర్చుకోవాల్సిందే.
వైష్ణవ్ తేజ్.. ఉప్పెనలా ఎగిసిన మెగా హీరో. తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన నటుడు. ఇలాంటి హీరో కెరీర్ ఎలా ఉండాలి? ఉప్పెనలా అదే ఊపుతో దూసుకుపోవాలి. కానీ వైష్ణవ్ తేజ్ కెరీర్ రోజురోజుకు డల్ అయిపోతోంది. అతడి కెరీర్ గ్రాఫ్ సినిమా సినిమాకు పడిపోతోంది. తాజాగా వచ్చిన ఆదికేశవతో మరో ఫ్లాప్ అందుకున్నాడు ఈ హీరో.
వైష్ణవ్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్ గ్రౌండ్ తో అతడికి వద్దన్నా సినిమాలు వస్తాయి. కాంపౌండ్ లో ఉన్న పెద్దలే అతడికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సినిమా సెట్ చేసి పెడతారు. కాబట్టి అవకాశాలు రావనే బాధ లేదు. అలాంటప్పుడు మంచి కథలు ఎంచుకోవాలి. ఈ విషయంలో వైష్ణవ్ తడబడుతున్నాడు.
ఉప్పెన తర్వాత అతడు చేసిన సినిమాలేవీ కమర్షియల్ హిట్ సాధించలేదు. కొండపొలం సినిమా థియేట్రికల్ గా ఆడలేదు. రంగరంగ వైభవంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆదికేశవ ఆల్ మోస్ట్ డిజాస్టర్ అంటున్నారు. ఇలాంటి కథలతో వైష్ణవ్ తేజ్ ఎలా కెరీర్ ను కొనసాగించాలనుకుంటున్నాడనేది ఆశ్చర్యం.
కెరీర్ ప్రారంభంలో హీరోలకు ఫ్లాపులు కామన్ అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఇలా సర్దిచెప్పుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవరు సక్సెస్ కొడతారో చెప్పలేని పరిస్థితి. బలగం సినిమా అంత పెద్ద హిట్టవుతుందని ఎవరు ఊహించారు? మసూద లాంటి చిన్న సినిమా మెరుస్తుందని ఎవరనుకున్నారు? సో.. వైష్ణవ్ తేజ్ తొందరపడాలి, మూస ఆలోచనల నుంచి బయటకు రావాలి. తన బ్యాక్ గ్రౌండ్ ను తన బలంగా మలుచుకోవాలి తప్ప.. అదే తన బలహీనతగా మారకుండా చూసుకోవాలి.