Telugu Global
Cinema & Entertainment

వచ్చేస్తున్నాయ్ యమ భారీ చిత్ర రాజాలు!

ప్రపంచంలో హాలీవుడ్ తర్వాత భారతీయ సినిమా పరిశ్రమే పెద్దదనే విషయంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం 20 కంటే ఎక్కువ భాషల్లో 1,500- 2,000 సినిమాల్ని మన దేశం నిర్మిస్తోంది.

వచ్చేస్తున్నాయ్ యమ భారీ చిత్ర రాజాలు!
X

ప్రపంచంలో హాలీవుడ్ తర్వాత భారతీయ సినిమా పరిశ్రమే పెద్దదనే విషయంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం 20 కంటే ఎక్కువ భాషల్లో 1,500- 2,000 సినిమాల్ని మన దేశం నిర్మిస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సినిమా పరిశ్రమ విలువ సుమారు 183 బిలియన్ రూపాయలని తేల్చారు. అంటే పద్దెనిమిది వేల 300 కోట్లు. ఇప్పుడు 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు 196 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. ఈ మధ్య మహమ్మారి కాలంలో మాంద్యాన్ని పక్కన పెడితే, 2007 నుంచీ స్థిరంగా ప్రపంచంలోనే అత్యధిక సినిమాల నిర్మాణ కేంద్రంగా వుంది మన దేశం. 2020 ఆర్థిక సంవత్సరంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ బాక్సాఫీసు ఆదాయం సుమారు 139 బిలియన్ రూపాయలు. అంటే పదమూడు వేల 900 కోట్లు. మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నాక ఈ మొత్తం తరువాతి సంవత్సరం 30 బిలియన్లకి తగ్గుతుందని అంచనా వేశారు. అయితే 2022 ఆర్థిక సంవత్సరం అంచనాలు రికవరీని చూపుతున్నాయి. 2019 లో బాక్సాఫీసు ఆదాయంలో బాలీవుడ్ వాటా 44% వుంటే, తెలుగు, తమిళ రంగాలు 13% చొప్పున వాటా పొందాయి. ఇది ఇంచుమించు ఇలాగే కొనసాగుతోంది.

అయితే పై అంకెలు ప్రాంతీయ భేదాలు తొలగి పోవడం వల్లే సాధ్యమయ్యాయి. ఆలిండియా మార్కెట్ కేవలం హిందీ సినిమాలదే అన్న బ్రాకెట్ ఇక తొలగిపోయింది. దక్షిణం నుంచి తెలుగు తమిళ కన్నడ సినిమాలు కూడా ఇప్పుడు ఆలిండియా/ పానిండియా సినిమాలుగా ప్రమోట్ అయిపోయాయి. చిన్న, మధ్యస్థ, పెద్ద బడ్జెట్ సినిమాలుగా స్థానికంగా వుండిపోయిన దక్షిణ సినిమాలు, భారీ బడ్జెట్ లతో యావద్దేశ మార్కెట్ దృష్టితో నిర్మాణాలు జరుపుకోవడంతో ఇది సాధ్యమైంది. ఈ ట్రెండ్ కి బాహుబలి రెండు భాగాలు స్ఫూర్తి నిచ్చాయి. బాహుబలి రెండు భాగాల్తో ప్రభాస్ తొలి పాణిండియా స్టార్ గా చరిత్రలో నమోదయ్యాడు. క్రేజ్ తో సాహో బడ్జెట్ 350 కోట్లు , రాధేశ్యామ్ బడ్జెట్ 300 కోట్లు లతో మరింత ముందుకెళ్లి, చేతిలో అయిదారు పానిండియా సినిమాలున్న ఏకైక స్టార్ గా రికార్డు సృష్టించాడు.

ఇక ఏ దక్షిణ స్టార్ సినిమా అయినా మెగా బడ్జెట్స్ తో తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ లిస్టు చూస్తే, రామ్ చరణ్ -ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ (550 కోట్లు), అల్లు అర్జున్ తో పుష్ప -1 (170 కోట్లు), కమల్ హాసన్ తో విక్రమ్ (120 కోట్లు), యష్ తో కేజీ ఎఫ్ రెండు భాగాలు (100 కోట్లు చొప్పున)... ఇలా ఏది చూసిన వందల కోట్ల పెట్టుబడికి ఎగబ్రాకిపోయాయి.

దక్షిణ సినిమాలు సృష్టించిన ఈ ట్రెండ్ ని తట్టుకోవాలంటే హిందీ సినిమాలకూ మెగా బడ్జెట్స్ తో అత్యంత భారీ సినిమాలు తీయక తప్పడం లేదు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ (310 కోట్లు), 83 (270 కోట్లు), పద్మావత్ (215 కోట్లు), టైగర్ జిందా హై (210 కోట్లు).... ఇలా పెరుగుతూ పెరుగుతూ 'బ్రహ్మాస్త్ర (410 కోట్లు) వరకూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక ముందు రానున్న సూపర్ మెగా బడ్జెట్ ఇండియన్ సినిమాలేమిటో చూద్దాం...

పొన్నియిన్ సెల్వన్ (500 కోట్లు), పుష్పా-2 (350 కోట్లు), ప్రభాస్ ప్రాజెక్ట్ కె (600 కోట్లు), ప్రభాస్ ఆది పురుష్ (500 కోట్లు), ప్రభాస్ సాలార్ (200 కోట్లు), షారూఖ్ ఖాన్ పఠాన్ (250 కోట్లు), సల్మాన్ ఖాన్ టైగర్ 3 (350 కోట్లు), రణనవీర్ సింగ్ -టైగర్ ష్రాఫ్ బడేమియా -చోటే మియా (280 కోట్లు), కమల్ హాసన్ ఇండియన్ 2 (200 కోట్లు), నాగార్జున ఘోస్ట్ (170 కోట్లు), చిరంజీవి గాడ్ ఫాదర్ (250 కోట్లు)...ఇవి గాక కొత్తగా ప్రకటించిన మాహేష్ బాబు -రాజ మౌళి మూవీ (1000 కోట్లు), శంకర్ -సూర్య మూవీ (1000 కోట్లు)... ఇలా వెయ్యి కోట్లకు చేరింది!

ఇక ప్రేక్షకులే జేబుల్లోంచి వందలకి వందలు తీసి పెట్టాలి. అదనంగా 30 గ్రాముల పాప్ కార్న్ కి 100 రూపాయలు, 70 గ్రాముల పాప్ కార్న్ కి 200 రూపాయలు, ఇంకా కూల్ డ్రింక్స్ ఫగైరాలు కలిపి 800 ఇప్పట్నుంచే సర్దుకోవడం చేయాలి. బడ్జెట్ కేటాయింపులు జరుపుకోవాలి. అవసరమైతే షార్ట్ టర్మ్ లోన్లు తీసుకోవచ్చు. నిర్మాతలు ఈఎంఐ లపై సినిమాలు చూసే సౌకర్యం కల్పిస్తే మంచిదే!

First Published:  13 Sept 2022 3:06 PM IST
Next Story