'దళపతి'కి వై ప్లస్ కేటగిరి భద్రత
విజయ్ కు కేంద్ర సాయుధ బలగాల భద్రత కల్పిస్తూ హోం శాఖ నిర్ణయం
![దళపతికి వై ప్లస్ కేటగిరి భద్రత దళపతికి వై ప్లస్ కేటగిరి భద్రత](https://www.teluguglobal.com/h-upload/2025/02/14/1403396-vijay.webp)
తమిళ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 24 గంటల పాటు కేంద్ర సాయుధ బలగాలు ఆయనకు రక్షణ కల్పిస్తారని వెల్లడించింది. దళపతికి ప్రమాదం పొంచి ఉందనే నిఘా వర్గాల హెచ్చరికతోనే హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 11 మంది సాయుధులు షిఫ్టుల వారీగా విజయ్ కు భద్రత కల్పించనున్నారు. విజయ్ కు సెక్యూరిటీగా నియమించే వారిలో నలుగురు వరకు కమాండోలు మిగిలిన వారు పోలీసులు ఉంటారు. విజయ్ కాన్వాయ్ లో రెండు వాహనాలకు అవాకశం కల్పించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇటీవలే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ భేటీ అయ్యారు. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో నాయకత్వ పోరాటం, ఇతర అంశాలతో ఏర్పడిన పొలిటికల్ వ్యాఖ్యూమ్ ను భర్తీ చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నారు. ఆయనకు ప్రజలు ఎంతమేరకు అండగా నిలుస్తారో ఎన్నికల్లోనే తేలనుంది.