Telugu Global
Cinema & Entertainment

రెండు సార్లు ఇంటర్వెల్ అంటే మస్తు బిజినెస్సే కానీ...

డిసెంబర్ 1న విడుదలవుతున్న రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చుట్టూ వూహాగానాలు నిన్నటి నుంచీ పెరుగుతూనే వున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సైకోపాత్ యాక్షన్ థ్రిల్లర్, రెండు ఇంటర్వెల్స్ తో వుంటుందని విచిత్రమైన రూమర్స్ వ్యాపిస్తున్నాయి.

రెండు సార్లు ఇంటర్వెల్ అంటే మస్తు బిజినెస్సే కానీ...
X

డిసెంబర్ 1న విడుదలవుతున్న రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చుట్టూ వూహాగానాలు నిన్నటి నుంచీ పెరుగుతూనే వున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సైకోపాత్ యాక్షన్ థ్రిల్లర్, రెండు ఇంటర్వెల్స్ తో వుంటుందని విచిత్రమైన రూమర్స్ వ్యాపిస్తున్నాయి. కారణం, సినిమా రన్‌టైమ్ అని తెలుస్తోంది. ఈ రోజు కొన్ని గంటల క్రితం, సినిమా రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు అని కొన్ని టికెట్ బుకింగ్ యాప్స్ నుంచి స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది. మరో రూమర్ సినిమా అసలు రన్‌టైమ్ 3 గంటల 18 నిమిషాలని వైరల్ అవుతోంది. తక్కువ నిడివిగల సినిమాల్ని ఇష్టపడుతున్న ఈ రోజుల్లో ఇంత నిడివి వున్న సినిమా స్పష్టంగా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది- నిడివి ఎక్కువ వున్నందున రెండు విరామాలు వుంటాయని!

నిర్మాతల నుంచి ఏ ప్రకటనా లేకపోయినా, ‘యానిమల్’ సినిమా వికీపీడియా పేజీలో రన్ టైమ్ ఇవ్వకున్నా, ఎవరు ఈ పుకార్లు లేపారో తెలియడం లేదు. ప్రేక్షకులకి ఇంత నిడివి గల సినిమాలని చూసే అలవాటు లేదు కాబట్టి సినిమాకి రెండు ఇంటర్వెల్‌లు ఎలా అవసరమో సోషల్ మీడియాలో డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. రెండు విరామాలు వున్నప్పటికీ, మూడుగంటలకి పైగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగే విషయం సినిమాలో వుండడం చాలా అవసరమని గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం బుకింగ్ వెబ్‌సైట్‌లు రన్ టైమ్‌ ని పేర్కొనలేదు. రిలీజ్ కి ఇంకా నెల సమయముంది. కనుక వైరల్ చేసిన స్క్రీన్ షాట్ నకిలీదని అనుకోవచ్చు. ఐఎండిబి వెబ్సైట్ లో మాత్రం రన్ టైమ్ రెండు గంటల 26 నిమిషాలుగా వుంది.

‘యానిమల్’ లో రణబీర్ కపూర్ తోబాటు రశ్మికా మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్ నటించారు. తండ్రీకొడుకుల కథ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. గత నెల తమిళంలో విడుదలైన విజయ్ నటించిన ‘లియో’ కూడా తండ్రీకొడుకుల కథ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామానే!

‘యానిమల్’ గ్యాంగ్ స్టర్ డ్రామా అయినా ఇంకేదైనా రెండు విరామాలతో విడుదలైతే అది సంచలనమే, ఎందుకంటే 1960, 70 ల తర్వాత విడుదలైన రెండు విరామాల సినిమా ఇదే అవుతుంది. 1964లో విడుదలైన ‘సంగమ్’ మన దేశంలో మూడు గంటల 58 నిమిషాల నిడివితో రెండు విరామాలని కలిగివున్న మొట్టమొదటి చలన చిత్రంగా నిలిచింది. ఇంత నిడివి, రెండు విరామాలూ ఏవీ లెక్క చేయకుండా అతి పెద్ద హిట్టయ్యింది. తర్వాత 1970 లో ‘మేరా నామ్ జోకర్’ మరింత నిడివితో నాలుగు గంటల 15 నిమిషాల సినిమాగా విడుదలైంది. దీనికీ రెండు విరామాలు ఇచ్చారు. ఇందులో కూడా సూపర్ హిట్ పాటలున్నప్పటికీ ఫ్లాపయ్యింది. ఈ రెండూ షోమాన్ రాజ్ కపూర్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించినవే!

విరామమిస్తే ఖబడ్దార్!

మళ్ళీ ఇంత నిడివిగల సినిమాలని ఎవరూ సాహసించలేదు. ఒక ఇంటర్వెల్ తో మూడు గంటల నిడివి గల సినిమాలు సర్వ సాధారణం. మూడు గంటలు దాటితే ప్రేక్షకులు భరించలేరని భయం. గతనెల రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ నిడివి 3 గంటల ఒక్క నిమిషం. ఫ్లాప్ టాక్ రావడంతో అరగంట తగ్గించారు. అయినా ఫ్లాపయ్యింది. సినిమా రీళ్ళు వున్న కాలంలో ఆంధ్రా ఏరియాలో సినిమా జాతకం ప్రొజెక్టర్ ఆపరేటర్ల చేతిలో వుండేది. సినిమా ఎక్కడెక్కడ ప్రేక్షకులకి బోరు కొడుతోందో అక్కడక్కడ కత్తిరించేసే వారు. అప్పుడు సినిమా బాగా ఆడేది. కత్తిరించినట్టు కూడా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఈ రోజుల్లో అరగంట తగ్గించామనీ, లేదా ఒక పాట తొలగించామనీ విడుదలయ్యాక ప్రకటించి షోలు వేస్తే, వీళ్ళకి సినిమా తీయడం రాలేదని తెలిసిపోయి ప్రేక్షకులు ఎగనామం పెడుతున్నారు.

అసలు రెండున్నర గంటల సినిమాలకి కూడా రెండు విరామాలు అవసరమేనని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండాఫ్ విషయం లేని బోరు కొట్టే సినిమాలే వస్తున్నాయి. సెకండాఫ్ కూర్చుని భరించలేకపోతున్నారు. రెండు విరామాలిస్తే ఈ బోరు తప్పించుకుని బయట సేద దీరి వస్తారు. సినిమా బోరుకొట్టినట్టే అన్పించదు.

పైగా థియేటర్లో స్నాక్స్, డ్రింక్స్ వగైరా రెండు సార్లు అమ్ముడుబోతాయి. మంచి బిజినెస్. అయితే ‘యానిమల్ ‘ లాగా మూడు గంటలు పైబడిన సినిమాలకి రెండు విరామాలిస్తే కొన్ని సమస్యలొస్తాయి. ఆటల సంఖ్య తగ్గుతుంది. పైగా ఒక్కో ఆటకి విద్యుత్, ఏసీ వగైరా నిర్వహణ ఖర్చులూ పెరుగుతాయి. టికెట్టు ధర మాత్రం పెరగదు.

అసలు విరామమే వుండదని చెప్పేస్తే? నిర్మాతలు విరామం ఇవ్వకుండా ప్రదర్శించాలని ఆదేశిస్తే? గొడవలు జరుగుతాయి. ప్రస్తుతం ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ తో గొడవలే జరుగుతున్నాయి. సినిమా కథనానికి అంతరాయం కలిగించకూడదన్న ఒకే ఒక నిబంధనతో ఈ హాలీవుడ్ మూవీ రిలీజ్ చేశారు. మన దేశంలో కూడా సెప్టెంబర్ 27 న విడుదల చేశారు. మహా దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ రూపొందించిన ఈ సినిమా నిడివి మూడు గంటల 43 నిమిషాలు! ఇది ఏకబిగిన చూసి అనుభూతించాల్సిన సినిమా అని, మధ్యలో కథనానికి అంతరాయం కలిగితే గొప్ప సినిమా చూసిన వీక్షణానుభవం వుండదనీ, ఎగ్జిబిటర్లకి నిబంధన విధించి విడుదల చేశారు. నిబంధన ఉల్లంఘిస్తే ఖబడ్దార్- ఆ థియేటర్లో ప్రదర్శనలు క్యాన్సిల్ చేస్తామని క్లాజు కూడా పెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదలైంది. అయితే జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, బ్రెజిల్, ఆమ్‌స్టర్‌డామ్, కొలరాడోలలో కొన్ని సినిమా హాళ్ళు ఖబడ్దార్ ని పక్కనబెట్టి - 6 నుంచి 15 నిమిషాలు విరామం ఇచ్చి జబర్దస్తీగా ఆటల్ని ప్రదర్శించడంతో, పారామౌంట్ - ఆపిల్ నిర్మాణ సంస్థలు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మెడ బట్టుకుని ఆటల్ని నిలిపి వేశాయి!

First Published:  1 Nov 2023 3:17 PM IST
Next Story