Telugu Global
Cinema & Entertainment

కొత్త హీరోయిన్లు @ 2021 ఎక్కడ?

2021 లో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన హీరోయిన్లలో ఓ నల్గురే పాపులరై మిగిలిన హీరోయిన్లు కనిపించకుండా పోయారు.

కొత్త హీరోయిన్లు @ 2021 ఎక్కడ?
X

2021 లో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన హీరోయిన్లలో ఓ నల్గురే పాపులరై మిగిలిన హీరోయిన్లు కనిపించకుండా పోయారు. తెలుగు సినిమాల్లో సినిమాకొక కొత్త హీరోయిన్ని పరిచయం చేయడం మామూలే. ప్రతీ సంవత్సరం ఓ 10 శాతం సినిమాలే హిట్టయి, మిగతా 90 శాతం అడ్రసు లేకుండా పోవడంతో, ఓ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన కొత్త హీరోయిన్లు మళ్ళీ కనిపించకుండా పోతున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా స్టార్ సినిమాల్లో నటిస్తేనే. చిన్న, మధ్య తరహా సినిమాల్లో నటించే కొత్త హీరోయిన్లు మాత్రం మళ్ళీ రిపీటవరు. స్టార్ సినిమాల్లో పరిచయమైతేనే రిపీటవుతారు.

అయితే చిన్న, మధ్య తరహా సినిమాల్లో ఏ సినిమాకా సినిమా నిర్మాతలు, దర్శకులూ కొత్త హీరోయిన్ని తెచ్చుకోవడంతో ఆ సినిమాతో ఆ హీరోయిన్ పనై పోతోంది. ఒక చిన్న, లేదా మధ్య తరహా సినిమా ఫ్లాపయినా, అందులో నటించిన కొత్త హీరోయిన్ బావుంటే ఇతర నిర్మాతలు, దర్శకులు ఆమెని ప్రోత్సహించ వచ్చు. అలా చేయకపోవడంతో బావున్న కొత్త హీరోయిన్ ప్రేక్షకుల్లో పాపులర్ కాలేక పోతోంది. ఇలా చిన్న, మధ్య తరహా సినిమాలకి ఓ స్టార్ హీరోయిన్ అంటూ లేకుండా పోవడం జరుగుతోంది. చిన్న, మధ్య తరహా సినిమాల్లో బావున్న కొత్త హీరోయిన్ని రిపీట్ చేస్తే, పాపులర్ అయిన ఆమె కోసమైనా ప్రేక్షకులు చిన్న, మధ్య తరహా సినిమాల్ని కొంతైనా ఆడిస్తారు. ఇది నిర్మాతలకే లాభం.

ఒకప్పుడు చిన్న సినిమాలకంటూ స్టార్ హీరోయిన్లు వుండే వాళ్ళు. రోజారమణి, ప్రభ, గీత, రజనీ లాంటి వాళ్ళు. గుర్తింపు పొందిన వీళ్ళు నటించే చిన్న సినిమాలకి ప్రేక్షకాదరణ వుండేది. తర్వాతి కాలంలో రవళి, గజలా, రైమా సేన్, సింధు తులానీ లాంటి హీరోయిన్లు చిన్న సినిమాల్లో రిపీటై వాళ్ళ పాపులారిటీతో సినిమాలు అడేవి. ఈ బిజినెస్ మోడల్ ని ఎప్పుడో మర్చిపోయారు. సినిమాకో కొత్త హీరోయిన్ పాతకంతో తో బిజినెస్ చెడగొట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రెండేళ్ళ క్రితం 2021 లో పరిచయమైన ఎందరు కొత్త హీరోయిన్లు మళ్ళీ సినిమాల్లో కనిపించారనీ చూస్తే- నలుగురే తేలతారు. శ్రీలీల, కృతీశెట్టి, కేతికా శర్మ, ఫరియా అబ్దుల్లా. మిగిలిన ఓ వంద మంది కొత్త హీరోయిన్లు ఇంకో సినిమా లేకుండా పోయారు. ‘పెళ్ళి సందడి’ తో శ్రీలీల, ‘ఉప్పెన’ తో కృతీశెట్టి, ‘రోమాంటిక్’ తో కేతికా శర్మ, ‘జాతి రత్నాలు’ తో ఫారియా అబ్దుల్లా. ఈ నల్గురూ తర్వాత పెద్ద స్టార్లు నటించే సినిమాల్లో స్టార్ హీరోయిన్లయి పోయారు.

ఇక చిన్న, మధ్య తరహా సినిమాల్లో పరిచయమైన ఇతర కొత్త హీరోయిన్లు- తాన్యా రవిచంద్రన్, కాశిష్ ఖాన్, ఆర్జవీ, నవమీ గయాక్, లవ్లీ సింగ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, శ్వేతా వర్మ, సహస్రా రెడ్డి, గాయత్రీ అయ్యర్, అవంతిక, అమ్ము అభిరామి, దృశ్యా రఘునాథ్, షెర్రీ అగర్వాల్, హేమా ఇండ్లే, స్పందనా పల్లి, అనన్యా నాగళ్ళ, సంచిత, సురభీ పురాణిక్, చిత్రా శుక్లా, శ్వేతా దీక్షిత్, అర్చనా అనంత్, సింధూ శ్రీనివాస మూర్తి, లావణ్యా రెడ్డి, సాత్వికా జే, కావ్యా థాపర్, కృష్ణ ప్రియ, శ్వేతా వర్మ, శ్వేతా అవస్థి, సిమ్రాన్ చౌదరి, వైశాలీ రాజ్, అదితీ అరుణ్, తనిష్కా రంజన్, శ్వేతా పరాశర్, సంచితా పడుకొనే, శ్రీవిద్యా మహర్షి, శృతీ మెహర్, సాన్వీ మేఘన... ఈ 38 మందితో పాటు ఇంకా ఇందరో మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. వీళ్ళని పరిచయం చేసిన చిన్న, మధ్య తరహా నిర్మాతలూ దర్శకులూ కూడా కనిపించలేదు.

ప్రతీ సంవత్సరం ఇదే రిపీటవుతూ వుంటుంది. ఏడాదికి వంద మంది కొత్త హీరోయిన్లు వచ్చినా, మళ్ళీ ఏడాదికి ఇంకో వంద మంది కొత్త హీరోయిన్లని దిగుమతి చేసుకోగల నిర్మాతల, దర్శకుల అపార సామర్ధ్యానికి, పట్టుదలకి మెచ్చుకుని తీరాలి. ఓ పది చిన్న, మధ్య తరహా సినిమాల్లో ఓ కొత్త హీరోయిన్ క్రేజ్ పెంచి, పాపులర్ చేసుకుని లాభపడదామన్న ముందు చూపు లేనందుకు కూడా అభినందించాల్సిందే!

First Published:  29 Aug 2023 4:20 PM IST
Next Story