Telugu Global
Cinema & Entertainment

దసరాకు సీనియర్ హీరోల మధ్య సమరం..!

దసరాకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి

దసరాకు సీనియర్ హీరోల మధ్య సమరం..!
X

తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి, దసరా పండుగలు అతి పెద్ద సీజన్లు. అవి పెద్ద పండగలు కావడం, వరుస సెలవులు కూడా ఉంటాయి కాబట్టి ఆ పండగల సమయంలో సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోలు నటించే సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కరోనా ఆంక్షలు ఉండటం, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేకపోవడంతో అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు పండగ సమయంలో విడుదల కాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ దసరాకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న మూవీ `గాడ్ ఫాదర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు ఇది రీమేక్. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మరో హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.

మరో సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో 'ది ఘోస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా, ఇందులో నాగ్ కు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఈ చిత్రం కూడా అక్టోబర్ 5న రిలీజ్ అవనుంది. రవితేజ - సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `రావణాసుర`. ఇందులో దక్ష, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది.

బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ మాస్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ మాస్ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను కూడా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.

తమిళ్ లో మణిరత్నం దర్శకత్వంలో బాహుబలి రేంజ్ లో వస్తున్న సినిమా `పొన్నియన్ సెల్వన్`. ఈ మూవీలో స్టార్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి నటిస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. అగ్ర హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు దసరాకు విడుదల కానుండటంతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  14 July 2022 3:25 PM IST
Next Story