Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండ ఒక మెగా ట్రెండ్

మొదట 'అర్జున్ రెడ్డి', ఇప్పుడు 'లైగర్' ఈ రెండూ విజయ్ కెరీర్ లో రెండు మైలు రాళ్ళు. ఆగస్ట్ 25 న విడుదల కానున్న 'లైగర్' లో బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి ప్రమోట్ చేయడంలో బిజీగా వున్న విజయ్, దేశమంతటా యాత్ర చేపట్టాడు.

X

'లైగర్' తో విజయ్ దేవరకొండ పానిండియా స్టార్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడికెళ్ళినా ఫ్యాన్సే ఫ్యాన్స్. తన తొలి పానిండియా మూవీ 'లైగర్' ఈ నెల 25 న రిలీజ్ కాకముందే అసంఖ్యాక ఫ్యాన్స్ శ్రేణి ఏర్పడిపోయింది. ముంబాయిలో మాల్ పట్టనంత మంది ఫ్యాన్స్ క్రిక్కిరిసిపోయిన దృశ్యాలు చూసి దేశమే విస్తుపోయింది. ఏ బాలీవుడ్ స్టార్ కీ ఇంత మాస్ మేనియా కనిపించలేదు. తెలుగు స్టార్స్ విషయంలోనే ఇది చూస్తున్నాం. మొన్న 'పుష్ప' తో అల్లు అర్జున్, ఇప్పుడు 'లైగర్' తో విజయ్ దేవరకొండ ఈ రికార్డు సాధించారు. తమిళ స్టార్స్ కి కూడా లేని ఆదరణ ఈ ఇద్దరు తెలుగు స్టార్స్ సొంతం చేసుకున్నారు.

మొదట 'అర్జున్ రెడ్డి', ఇప్పుడు 'లైగర్' ఈ రెండూ విజయ్ కెరీర్ లో రెండు మైలు రాళ్ళు. ఆగస్ట్ 25 న విడుదల కానున్న 'లైగర్'లో బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి ప్రమోట్ చేయడంలో బిజీగా వున్న విజయ్, దేశమంతటా యాత్ర చేపట్టాడు.

నెటిజన్ల దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు. సామాన్యుడిలా జనంలో కలిసిపోయే కేర్ ఫ్రీ వైఖరికి అభిమానులు వెర్రెత్తి పోతున్నారు. డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోకుండా, స్లిప్పర్స్ వేసుకుని తిరిగేస్తున్నాడు. ముంబైలో జరిగిన 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కి కూడా స్లిప్పర్స్ వేసుకునే కన్పించాడు. ఇదేమిటని అడిగితే, 'నాకేదైనా ఓకే, జబ్ మూడ్ లాగా కుచ్ భీ ఫెహన్తా హూ' (నాకు ఏది అనిపిస్తే అది ధరిస్తాను) అని జవాబిచ్చాడు. 30 రోజులు సినిమాని ప్రమోట్ చేస్తూ తిరుగుతూ, ప్రతీ రోజూ షూస్, డ్రెస్ మార్చాలంటే టైముండదని అనేశాడు.

'నువ్విలా' (2011) తో సినిమాల్లోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ 'ఎవడే సుబ్రమణ్యం' (2015) తోనే గుర్తింపు పొందాడు. 'పెళ్లి చూపులు' (2016) తో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో అయ్యాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'పెళ్ళి చూపులు' 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చలనచిత్రం, దీంతో పాటు ఫిల్మ్‌ ఫేర్ ఉత్తమ చలన చిత్రం అవార్డులూ గెలుచుకుంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి' (2017) తో బ్లాక్ బస్టర్ స్టార్ అయ్యాడు విజయ్. మ్యాడ్ రాడికల్ లవర్ పాత్రకి కొత్త భాష్యం చెప్తూ దేశవ్యాప్త సంచలనం సృష్టించాడు. 'అర్జున్ రెడ్డి' తెలుగు సినిమా ప్రేమ కథలకొక కొత్త కొలమానమైంది. దీనికి ఫిలిమ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. 2018లో 'మహానటి', 'టాక్సీవాలా', 'గీత గోవిందం' మూడు హిట్లతో అగ్రస్థాయికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ 2018లో అత్యధిక వసూళ్ళు సాధించిన తెలుగు సినిమాలుగా నిలిచాయి. మధ్యమధ్యలో 'ఏ మంత్రం వేశావే', 'ద్వారకా', 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి భారీ ఫ్లాపులు కూడా ఇచ్చాడు.

'లైగర్' విషయానికొస్తే, దీనికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణం జరుపుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా, తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఇందులో ప్రసిద్ధ అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించడం ఆసక్తి రేపుతోంది. మన దేశంలో మొదటి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ డ్రామాగా హిందీలో 'బ్రదర్స్' వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్ నటించాడు. ఇది 'వారియర్' అనే హాలీవుడ్ మూవీకి రీమేక్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో 'లైగర్' వస్తోంది. విశేష మేమిటంటే, దీని నిర్మాత కరణ్ జోహార్ 'లైగర్' కి కూడా నిర్మాతే. రెండూ మిక్స్డ్ మార్షియల్ ఆర్ట్స్ సినిమాలే.

'లైగర్' తక్కువ రన్‌టైమ్ తో, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో, ఈలలు వేయించే విజయ్ క్యారెక్టరైజేషన్ తో, మాస్ డైలాగ్ డెలివరీతో, విజయ్ పాత్ర, తల్లి భావోద్వేగాలతో, విజయ్-హీరోయిన్ అనన్య పాండేల క్రేజీ లవ్ ట్రాక్ తో యూత్- బాక్సాఫీసు అప్పీల్ ని తారాస్థాయికి తీసికెళ్తుందని అంటున్నారు.

విజయ్ దేవరకొండ క్లాస్- మాస్ ప్రేక్షకులందరికీ అభిమాన స్టార్. నటనలో అవార్డులతో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు- అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత మరో అలాటి డార్క్ క్యారక్టర్ చేయలేదు. నిర్లక్ష్యపు మ్యాడ్, డార్క్, రాడికల్ క్యారక్టర్లు నటించే సత్తాగల యాక్షన్ హీరో కూడా తనే.

2018 లో ఫోర్బ్స్ ఇండియా సెలెబ్రిటీ లిస్టులో 72 వ స్థానాన్ని ఆక్రమించిన విజయ్ దేవరకొండ నటించిన పానిండియా 'లైగర్' మీదే ఇప్పుడు అందరి దృష్టీ వుంది. ఇది పూరీకి కూడా సవాలే. విజయ్ దీంతో ఆలిండియా హిట్టిస్తే ఇక తిరుగుండదు. తెలుగు నుంచి మొదటి పానిండియా స్టార్ ప్రభాస్ కి పోటీనిచ్చే స్థితికి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం అనేక ఫ్లాపుల తర్వాత ఈ నెలలోనే వరుసగా 'సీతారామం', 'బింబిసార'. 'కార్తికేయ2' మూడు పెద్ద సినిమాలు హిట్టయి టాలీవుడ్ ని విజయాల వైపు నడిపించాయి. ఈ ప్రయాణాన్ని 'లైగర్' ఇంకింత ముందుకు నడిపిస్తాడా లేదా అన్న సస్పెన్స్ తో ప్రేక్షకలోకం, పరిశ్రమ ఎదురు చూస్తున్నాయి.

First Published:  24 Aug 2022 12:00 PM IST
Next Story