Sreeleela | శ్రీలీల ఎంట్రీతో పూజా అవుటైందా?
Sreeleela and Pooja Hegde | తెలుగులో టాప్ స్టార్ పూజా హెగ్డేకి శ్రీలీల (Sreeleela) చెక్ పెడుతోందా? పూజా హెగ్డే (Pooja Hegde) అవకాశాల్ని తను లాగేసుకుంటోందా? శ్రీలీల దెబ్బకి పూజా హెగ్డే అవుటై పోయిందా? పూజా హెగ్డేని శ్రీలీల టాలీవుడ్ బయటికి పంపించేసిందా? ...ఈ వరసలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా వాస్తవ పరిస్థితి వుంది.
Sreeleela and Pooja Hegde | తెలుగులో టాప్ స్టార్ పూజా హెగ్డేకి శ్రీలీల చెక్ పెడుతోందా? పూజా హెగ్డే అవకాశాల్ని తను లాగేసుకుంటోందా? శ్రీలీల దెబ్బకి పూజా హెగ్డే అవుటై పోయిందా? పూజా హెగ్డేని శ్రీలీల టాలీవుడ్ బయటికి పంపించేసిందా? ...ఈ వరసలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా వాస్తవ పరిస్థితి వుంది. ఇద్దరూ పరస్పరం నువ్వా నేనా అని స్టార్ డామ్ పోరులో లేరు. స్టార్ హీరోలు, నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలే ఈ పరిణామాలకి దారి తీయిస్తున్నాయి. కొత్త హీరోయిన్ పాపులారిటీ చూసి వున్న హీరోయిన్లని స్టార్ హీరోలు, నిర్మాతలు పక్కన బెట్టడం మామూలే. పూజా హెగ్డే విషయంలో ఇది కూడా జరగ లేదు. ఒప్పుకున్న సినిమా షెడ్యూళ్ళు అస్తవ్యస్తమై, డేట్లు అడ్జస్టు కాక ఒక సినిమాలోంచి తప్పుకుంది.
మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ వివిధ సమస్యల కారణంగా నిరంతర జాప్యాన్ని ఎదుర్కొంటోంది. షూటింగు ప్రారంభించడం, ఆపేయడం; స్క్రిప్టులో మార్పులు చేయడం, రీ షూట్ లు చేయడం మొదలైన సమస్యలతో పూజా హెగ్డే అసంతృప్తి చెంది, డేట్ల సమస్యతో విధిలేక తనే తప్పుకుంది. ఆమె తప్పుకోవడంతో నిర్మాతలు శ్రీలీలని తీసుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్ గా పూజా హెగ్డేనే అనుకున్నారు. ఆమె 4 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో రెండు కోట్ల రేంజిలో వున్న శ్రీలీలని తీసుకున్నారు. ఈ రెండు సినిమాల విషయంలోనూ శ్రీలీల లాబీయింగ్ చేసి పూజా హెగ్డేని తప్పించింది లేదు. అలాగే శ్రీలీల తనకి ప్రత్యర్ధి అనుకుంటే మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ వదిలి పెట్టేది కాదు పూజా. అలాగే ‘పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 4 కోట్లు డిమాండ్ చేసేది కాదు.
గత సంవత్సరం రవితేజ నటించిన ‘ధమాకా’ తో రాత్రికి రాత్రి టాప్ హీరోయిన్ అయిపోయిన శ్రీలీల వెంట నిర్మాతలే పడుతున్నారు. దీంతో ఆమె చేతికి వరసగా సినిమాలు వచ్చాయి. ఏ కొత్త హీరోయిన్ సంచలనం సృష్టించినా జరిగేది ఇదే. దీంతో వున్న హీరోయిన్ల అవకాశాలు తగ్గుతాయి. పూజా హెగ్డే 2014 నుంచీ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. 2017 లో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ తో స్టార్ హీరోయిన్ అయింది. 2019 లో మహేష్ బాబుతో ‘మహర్షి’, 2020 లో తిరిగి ‘అల్లు అర్జున్’ తో ‘అల వైకుంఠ పురం’, 2021 లో అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూడు వరస హిట్ సినిమాలతో నిలదొక్కుకుంది. 2022 లో చిరంజీవి- రామ్ చరణ్ లతో ‘ఆచార్య’, ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ రెండూ ఫ్లాపయ్యాయి. స్టార్ హీరోలు నటించే సినిమాలు ఫ్లాప్ కావడానికీ, హీరోయిన్లకీ ఎలాటి సంబంధం వుండదు. కానీ ఈ రెండు ఫ్లాపులతో పూజా ఐరన్ లెగ్ హీరోయిన్ అని బిరుదు ఇచ్చేశారు. అయినా 2023 లో ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లకి ఒరిజినల్ గా ఆమెనే అనుకున్నారు.
ఇప్పుడు పూజా హెగ్డే టాలీవుడ్ చాప్టర్ క్లోజై బాలీవుడ్ పై దృష్టి పెట్టిందంటున్నారు. ఇప్పుడు కాదు, తెలుగు సినిమాల్లో నటిస్తూనే గత 7 సంవత్సరాలుగా హిందీ పైనా దృష్టి పెట్టింది. 2016 లో హృతిక్ రోషన్ సరసన నటించిన ‘మొహెంజొదారో’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మొదటి హిందీ సినిమా ఫ్లాపయ్యింది. తర్వాత 2019 లో అక్షయ్ కుమార్ తో నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ హిట్టయ్యింది. 2022 లో రణవీర్ సింగ్ తో నటించిన ‘సర్కస్’ ఫ్లాపయ్యింది. 2022 లోనే సల్మాన్ ఖాన్ తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ తో కూడా అదృష్టం అనుకూలంగా లేదు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ ప్రయత్నాలు చేయడం లేదు. సమాంతరంగా బాలీవుడ్ ని ప్రయత్నిస్తూ వస్తోంది.
ఇక ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గిపోవచ్చు. లేదా పూర్తిగా జీరో అవచ్చు. అయితే హీరోయిన్ల కెరీర్ కొనసాగేది కొద్ది కాలమే. ఐదేళ్ళు వుంటే మాహా ఎక్కువ. కాజల్ అగర్వాల్, తమన్నా, శృతీ హాసన్, హన్సిక, ఇలియానా ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. పూజా హెగ్డే కూడా ఈ దశ నెదుర్కోవాల్సిందే. దీంతో శ్రీలీలకేం సంబంధం లేదు. 31 ఏళ్ళ పూజా సీనియర్, 22 ఏళ్ళ లీలా కొత్త నీరు.
పూజా హెగ్డేనే కాదు, శ్రీలీల దెబ్బకి రశ్మిక కూడా అవుట్ అంటున్నారు. ఆమెకూడా సీనియరే. అయినా ఒక స్టార్ హీరోయిన్ ఎంట్రీతో తో మిగతా స్టార్ హీరోయిన్లందరూ అవుటై పోవడం ఎక్కడా జరగదు. స్టార్లందరూ సినిమా తర్వాత సినిమా శ్రీలీలతోనే నటిస్తే మొహం మొత్తుతుంది ప్రేక్షకులకి. మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’, పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, నవీన్ పోలిశెట్టి తో ‘అనగనగా ఒక రాజు’, వైష్ణవ్ తేజ తో ‘ఆదికేశవ’, ఇంకా పేరు పెట్టని సినిమాలు- బాలకృష్ణతో ఒకటి, విజయ్ దేవరకొండతో ఒకటి, రామ్ తో ఒకటి, నితిన్ తో ఒకటి మొత్తం 8 సినిమాలు ఇప్పటికీ ఒప్పుకుంది శ్రీలీల.
బెంగుళూరులో తెలుగు కుటుంబానికి చెందిన శ్రీలీల మెడిసిన్ చదివి సినిమాల్లోకి వచ్చింది. భరత నాట్యంలో ప్రవేశం వుండడం వల్ల ఆమె కమర్షియల్ డాన్సింగ్ వైరల్ అయింది. ‘ధమాకా’ లో ఇది చూసే ఆమె వెంట పడ్డారు తెలుగు నిర్మాతలు. కన్నడలో 2019 లో మొదటి సినిమా ‘కిస్’ నటించింది. ఆ తర్వాత ఇంకో కన్నడ నటించాక, 2021 లో కె. రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్ళిసందడి’ లో నటించి, 2022 లో రవితేజతో ‘ధమాకా’ నటించడంతో బిజీ స్టార్ అయిపోయింది.