Telugu Global
Cinema & Entertainment

హీరోలు లేని నవంబర్ లో ప్రేక్షకులు నిల్!

టాలీవుడ్ లో హీరోలకి కొదవ లేదు. హీరోల సినిమాలకూ కొదవ లేదు. అసలు హీరోలందరూ దర్శకులకి అందుబాటులో లేనంతగా బిజీగా వున్నారు.

హీరోలు లేని నవంబర్ లో ప్రేక్షకులు నిల్!
X

హీరోలు లేని నవంబర్ లో ప్రేక్షకులు నిల్!

టాలీవుడ్ లో హీరోలకి కొదవ లేదు. హీరోల సినిమాలకూ కొదవ లేదు. అసలు హీరోలందరూ దర్శకులకి అందుబాటులో లేనంతగా బిజీగా వున్నారు. చాలామంది దర్శకులకి హీరోలు దొరక్క నెలల తరబడి వెయిటింగ్ లో వుంటున్నారు. ఆఖరికి హిట్టయిన ‘మ్యాడ్’ కొత్త హీరో కూడా దర్శకులకి చిక్కడం లేదు. ఎందరో హీరోలు, ఎన్నో సినిమాలతో బిజీగా వున్నారు. చిన్నా పెద్దా హీరోలు కలిసి నెలకి ఐదారు సినిమాలు చొప్పున అందిస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు హేపీగా థియేటర్లకి వెళ్తున్నారు. ప్రేక్షకులతో థియేటర్లు బాక్సాఫీసులు నింపుకుంటున్నాయి. అలాటిది నవంబర్ లో ఒక్క హీరో ఐపు లేడు! ఒక్క సినిమా రిలీజ్ లేదు! ప్రేక్షకులు మళ్ళీ కోవిడ్ నాటి పరిస్థితులకి అద్దం పడుతూ థియేటర్ల వైపు చూడడం లేదు. ప్రేక్షకులు లేక థియేటర్లు మినీ లాక్ డౌన్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి!

జనవరిలో 4, ఫిబ్రవరిలో 5, మార్చిలో 5, ఏప్రెల్ లో 5, మేలో 6, జూన్ లో 4, జులైలో 5, ఆగస్టులో 5, సెప్టెంబర్ లో 3, అక్టోబర్ లో 5 - పెద్ద, చిన్న హీరోల సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచీ మీటర్ స్టార్ కిరణ్ అబ్బవరం వరకూ. కొత్త హీరోల చిన్నా చితకా సినిమాలూ డజన్ల కొద్దీ విడుదలయ్యాయి. ఇవి థియేటర్ల పోషణకి పనికొచ్చేవి కావు. రెగ్యులర్ షోలు కూడా పడవు. రోజుకి ఒక షోతో సరిపెట్టుకునేవే. రెండో రోజు అది కూడా నమ్మకం లేదు.

గత 10 నెలల్లో మూడు నుంచీ 6 సినిమాలు చొప్పున విడుదలవుతూ వచ్చిన పెద్ద, చిన్న హీరోల సినిమాలు నవంబర్ లో పూర్తిగా గైర్హాజరయ్యాయి. ముఖ్యమైన దీపావళికి కూడా పండుగ సినిమా లేకుండా పోయింది. ఈ సంవత్సరమే ఇలా మొదటి సారిగా జరిగింది. దీపావళికి సినిమా లేకపోవడం!

దీపావళికి తమిళ డబ్బింగులతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది ప్రేక్షకులు. ‘జపాన్’, ‘జిగర్తండా’ అనే రెండు సినిమాలు నవంబర్ 10 న విడుదలయ్యాయి. నవంబర్ 10 న దీపావళికి విడుదలవుతుందనుకున్న వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ ని వరల్డ్ కప్ ఫీవర్‌ ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 24 కి నెట్టారు. అప్పుడు కూడా విడుదలవుతుందని ధృవీకరణ లేదు. అలాగే రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ కూడా ప్రకటించిన నవంబర్ 10 విడుదల తేదీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అలాగే కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కూడా వాయిదా పడింది.

హీరోల సినిమాలన్నీ సంక్రాంతి విడుదలకే పోటీ పడుతున్నాయి. రాబోయే సంక్రాంతి హీరోల సినిమాలతో క్రిక్కిరిసిపోయి వుంటుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రవి తేజ ‘ఈగల్’ నాగార్జున ‘నా సామి రంగా’, వెంకటేష్ ‘సైంధవ్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, తేజ సజ్జా ‘హనుమాన్’ - ఈ 6 తెలుగు సినిమాలు కాక 3 తమిళ డబ్బింగులు రజనీకాంత్ ‘లాల్ సలాం’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తికేయన్ 'అయాలాన్' సంక్రాంతికే విడుదల ముహూర్తం పెట్టుకున్నాయి. 2023 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, తమిళ స్టార్ అజిత్ ‘తెగింపు’, మరో తమిళ స్టార్ విజయ్ ‘వారసుడు’ 4 సినిమాలు పోటీ పడ్డాయి. 2024 సంక్రాంతికి మొత్తం 9 సినిమాలు క్యూ కడుతున్నాయి.

ఇక డిసెంబర్ లో నాని ‘హీ నాన్నా’, ప్రభాస్ ‘సాలార్’ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూడు పెద్ద హీరోల సినిమాలు విడుదలవచ్చు. చిన్న హీరోల సినిమాలు లేవు. నవంబర్ అంతా చిన్నా చితకా కొత్త హీరోల సినిమాలే. దీంతో థియేటర్లకి క్షామమే. ఈ పరిస్థితి ఎగ్జిబిటర్లకి వణుకు పుట్టిస్తోంది. ఇలా ఎప్పుడూ లేదు. ముఖ్యంగా పీవీఆర్- ఐనాక్స్ వంటి మల్టీప్లెక్సులకి తీవ్ర నష్టం. బాలీవుడ్ నుంచి ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రం దీపావళి సినిమా వుండేలా చూసుకుంటాడు. ఈ దీపావళికి 12వ తేదీ తను నటించిన భారీ యాక్షన్ ‘టైగర్’ 5 భాషల్లో విడుదలవుతోంది. థియేటర్లని ఎంతో కొంత ఇదే ఆదుకోవాలి.

First Published:  11 Nov 2023 3:36 PM IST
Next Story