Telugu Global
Cinema & Entertainment

21 మంది హీరోలూ ఇచ్చింది 8 హిట్లు!

పానిండియా కలల తెలుగు హీరోల బాక్సాఫీసు పనితీరు హెచ్చరికలు పంపిస్తోంది.

21 మంది హీరోలూ ఇచ్చింది 8 హిట్లు!
X

21 మంది హీరోలూ ఇచ్చింది 8 హిట్లు!

పానిండియా కలల తెలుగు హీరోల బాక్సాఫీసు పనితీరు హెచ్చరికలు పంపిస్తోంది. ఇలాగే గనుక సినిమాలు నటిస్తూ పోతే ఆదరించడానికి ప్రేక్షకులు వుండరు. ఏ చిన్న, పెద్ద హీరో చూసినా చేతిలో రెండు మూడు సినిమాలతో చాలా బిజీగా వుంటున్నారు. రెండు మూడేళ్ళు ఇతర దర్శకులకి దొరికే పరిస్థితి లేదు. ఇంత బిజీగా వుంటూ నటిస్తున్న సినిమాలేమిటా అని చూస్తే, రెండు మూడు ఫ్లాపులు. ఈ సంవత్సరం జనవరి - మే మధ్య పేరున్న హీరోల తెలుగు సినిమాలు 23 విడుదలైతే, 8 మాత్రమే హిట్టయ్యాయి, 15 ఫ్లాపయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాని, ధనుష్, సాయిధరం తేజ్, అడివి శేష్, ప్రియదర్శి, సుహాస్ లు హిట్ హీరోలుగా నిలిస్తే, రవితేజ, కళ్యాణ్ రామ్, గోపీచంద్, నాగచైతన్య, అఖిల్, విశ్వక్ సేన్, సుధీర్ బాబు, అల్లరి నరేష్, నాగశౌర్య, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం, నరేష్- 12 మంది ఫ్లాప్ హీరోలుగా మిగిలారు. నటించిన 15 సినిమాలు చిరునామా లేకుండా పోయాయి.

మళ్ళీ చూస్తే రెండు మూడు కొత్త సినిమాలతో బిజీ. ఫ్లాపిచ్చిన హీరోలకి ఆఫర్లు ఆగడం లేదు. రెమ్యూనరేషన్లు తగ్గడం లేదు. కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్ లు ఎన్ని వరస అట్టర్ ఫ్లాపులిచ్చినా వాటితో సంబంధం లేకుండా కొత్త సినిమాలతో బిజీ. హీరోలకి, దర్శకులకి, నిర్మాతలకీ చేతి నిండా పనుండొచ్చు. కానీ మార్కెట్లో కొస్తే మాత్రం ఆ సినిమాలతో ప్రేక్షకులకి పనుండడం లేదు. సరైన ఓపెనింగ్సే వుండడం లేదు.

పరిశీలిస్తే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో లోడ్ చేస్తున్న హైపర్ యాక్షన్ బాక్సాఫీసు గరిష్ట ఎలిమెంట్లు, ఇతర హీరోల సినిమాల విషయంలో కనిష్టంగా సమకూర్చి వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవి, ‘వీరసింహా రెడ్డి’ లో బాలకృష్ణ క్యారక్టరైజేషన్లు, ఎలివేషన్లు, ఇతర కమర్షియల్ ఎలిమెంట్లు ‘రావణాసుర’ లో రవితేజ విషయాని కొచ్చేసరికి నేలబారు స్థాయికొచ్చేశాయి. ‘ఉగ్రం’ లో అల్లరి నరేష్ విషయానికొచ్చేసరికి తలపోటు తెప్పించాయి.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, నాని ‘దసరా’, సాయి ధరం తేజ్ ‘విరూపాక్ష’, అడివి శేష్ ‘హిట్2’, ప్రియదర్శి ‘బలగం’, సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ లతో బాటు, తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘సర్’ - ఈ 8 మాత్రమే ఈ 5 నెలల్లో హిట్టయ్యాయి. రెండు డబ్బింగులు ‘బిచ్చగాడు 2’, ‘2018’ హిట్టయ్యాయి.

రవితేజ ‘రావణాసుర’, కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’, గోపీచంద్ ‘రామబాణం’, విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’, నాగ చైతన్య ‘కస్టడీ’, అఖిల్ ‘ఏజెంట్’, సుధీర్ బాబు ‘హంట్’, అల్లరి నరేష్ ‘ఉగ్రం’, నాగశౌర్య ‘ఫలానా ఆమ్మాయి ఫలానా అబ్బాయి’, సంతోష్ శోభన్ ‘అన్నీ మంచి శకునములే’, ‘కళ్యాణం కమనీయం’, శ్రీదేవీ శోభన్ బాబు’; కిరణ్ అబ్బవరం ‘మీటర్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, నరేష్ ‘మళ్ళీ పెళ్ళి’- ఇలా 12 మంది హీరోలు 15 ఫ్లాపులిచ్చారు. ఇక హీరోయిన్ సమంతా నటించిన ‘శాకుంతలం’ కలుపుకుంటే 16 ఫ్లాపులు. 5 నెలల్లో 13 మంది హీరో/హీరోయిన్లతో 16 ఫ్లాపులు.

కంటెంట్ అవసరం లేదు కటౌట్ చాలనుకునే రోజులూ; లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ చాలనుకునే రోజులూ ఇంకా కొనసాగిస్తూ ప్రేక్షకులకి మేత పడేస్తున్నారు. గ్లోబల్ కంటెంట్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇప్పుడు మేధ కావాలని గుర్తించడంలేదు. ప్రేక్షకులు తెలుగేతర సినిమాలకి అలవాటు పడి, ఫేస్బుక్ లో పొగడ్తల రివ్యూలు రాసుకుంటూ ఒక నియమిత పరిమాణంలో ఆన్ లైన్ కమ్యూనిటీగా పొగవుతున్న విషయం టాలీవుడ్ తెలుసుకోవడం లేదు. పాత సినిమాలకి లక్షల్లో యూట్యూబ్ బ్యాచి ప్రేక్షకులు వేరే వున్నారు. తీసిన తెలుగు సినిమా ఫ్లాపైనా ఆ నష్టాన్ని ఓటీటీ భర్తీ చేస్తుందన్న తేలిక భావంతో తలపోటు సినిమాలు తీసి పడేస్తున్నారు.

జూన్ మొదటివారంలో విడుదలైన తేజ తీసిన ‘అహింస’ తలపోటుకి పరాకాష్ఠ. తమ్ముడ్ని హీరోగా చేయమని రానా తేజకి అప్పగిస్తే జీరో చేయడంతో జాగ్రత్తపడ్డ రానా, తేజ తోనే తను నటిస్తున్న సినిమాకి బాలీవుడ్ రచయితల్ని రప్పించుకోవడానికి సిద్ధపడ్డాడంటే, తెలుగు కంటెంట్ కర్తలు ఏ టాలెంట్ తో వున్నారో అర్ధం జేసుకోవచ్చు. సినిమా హాళ్ళల్లో నేల క్లాసు తీసేసినా, నేల క్లాసు వదిలిరావడానికి కంటెంట్ కర్తలు ససేమిరా అంటున్నారు. వీళ్ళు విన్పించే కంటెంట్ వింటూంటే మనకి బలి కాబోయే హీరోల మీద జాలిపుడుతుంది.

రాబోయే ఆరు నెలల్లో ఇంకెందరు హీరోలు అట్టర్ ఫ్లాపులిచ్చి బిజీ అయిపోతారో చూడాలి. అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన వాడే ఆఫర్లతో ఆలిండియా కింగ్!

First Published:  8 Jun 2023 3:24 PM IST
Next Story