Telugu Global
Cinema & Entertainment

ఇక మూస రీమేకుల మోజు తీరినట్టేనా?

బడ్జెట్ చూస్తే 101 కోట్లు, బిజినెస్ చూస్తే 80 కోట్లు, బాక్సాఫీసు చూస్తే 43 కోట్లు, నష్టం చూస్తే కోట్లు 58 కోట్లు! ఇదీ నిన్నటితో అయిదు రోజులనాటికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ పరిస్థితి! ఇక కోలుకునే అవకాశమే లేదు.

ఇక మూస రీమేకుల మోజు తీరినట్టేనా?
X

బడ్జెట్ చూస్తే 101 కోట్లు, బిజినెస్ చూస్తే 80 కోట్లు, బాక్సాఫీసు చూస్తే 43 కోట్లు, నష్టం చూస్తే కోట్లు 58 కోట్లు! ఇదీ నిన్నటితో అయిదు రోజులనాటికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ పరిస్థితి! ఇక కోలుకునే అవకాశమే లేదు. ఎందుకంటే నిన్న పంద్రాగస్టు సెలవు రోజు కూడా అత్యంత హీనంగా కేవలం 75 లక్షలు వసూలు చేస్తే ఇక పుంజుకునే అవకాశమెక్కడిది? ట్రేడ్ విశ్లేషకులు దీన్ని మొండి ఖాతాకింద రైటాఫ్ చేసేశారు.

చిరంజీవి రీమేకుల మోజుని పూర్తిగా తీర్చేసిన ఈ తమిళ ‘వేదాళం’ రీమేక్ కనీసం ట్రెండ్ లో వున్న వేరే డైరెక్టర్ తో తీసినా ఇంత డిజాస్టర్ అయ్యేది కాదేమో. చిరంజీవి బంధువైన మెహర్ రమేష్ కి అవకాశమివ్వడంతో అతను సినిమాతో అందరి అవకాశాలనూ దెబ్బ తీశాడు. పదేళ్ళ క్రితం ఎన్టీఆర్ తో ‘శక్తి’, వెంకటేష్ తో ‘షాడో’ అనే రెండు అట్టర్ ఫ్లాపులిచ్చి తెరమరుగైన- ఔట్ డేటెడ్ కూడా అయిపోయిన - మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ ని అత్యంత హాస్యాస్పదంగా మేకింగ్ చేసి రుణం తీర్చుకున్నాడు.

2015 లో ‘వేదాళం’ కథే పాత చింతకాయ అయితే, 2023 లో దాన్ని రీమేక్ చేసి బూజుపట్టిన చింతకాయ చేశారు. 2015 లో అజిత్ తో కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంటుతో ‘వేదాళం’ తీసిన శివయే, తిరిగి 2022 లో రజనీకాంత్ తో అదే కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో, సిస్టర్ సెంటిమెంటుతో ‘అన్నాత్తే’ తీసి ఫ్లాప్ చేశాడు. ఇది తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైంది కూడా. ఇది చూసైనా ‘భోళా శంకర్’ నుంచి వెనక్కి తగ్గాలి. తగ్గక పోగా ‘అన్నాత్తే’ లో సిస్టర్ గా నటించిన కీర్తీ సురేష్ నే చెల్లెలుగా పెట్టి ‘భోళా శంకర్’ ని చుట్టేశారు.

తమిళంలో పా. రంజిత్, లోకేష్ కనక రాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ నవతరం దర్శకులు ముగ్గురూ స్టార్ సినిమాల కథల్ని, పాత్ర చిత్రణల్ని మూస ఫార్ములా - టెంప్లెట్ చట్రంలోంచి బయటికి తీసి కమర్షియల్ సినిమాలకి కొత్త రూపం తొడుగుతున్నారు. కథలు, పాత్ర చిత్రణలే కాదు, కథనాన్ని కూడా సాంప్రదాయ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో విభేదించి రియలిస్టిక్ జానర్లోకి మార్చేస్తున్నారు. పా. రంజిత్ రజనీకాంత్ తో తీసిన ‘కబాలీ’, ‘కాలా’ ఆర్యతో తీసిన ‘సార్పట్టా’ ఈ కోవలో కొస్తాయి. లోకేష్ కనక రాజ్ కార్తీతో తీసిన ‘ఖైదీ’, కమల్ హాసన్ తో తీసిన ‘విక్రమ్’ ఈ పంథాననుసరించాయి. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ శివ కార్తికేయన్ తో తీసిన ‘డాక్టర్’, ఇప్పుడు రజనీ కాంత్ తో తీసిన తాజా ‘జైలర్’ దీనికి అద్దం పడతాయి. బాలీవుడ్ ఈ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించక ఫ్లాపులతో కుంగుతోంది. టాలీవుడ్ ఇంకా చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ ల కాలం నాటి పాత మూస ఫార్ములా- టెంప్లెట్ లోనే ఇరుక్కుని ‘భోళాశంకర్’ లాంటి పరాభవాల్ని చవిచూస్తోంది.

రీబూట్ చేసిన సీనియర్ స్టార్ కమర్షియల్ కి ‘జైలర్’ ని మించిన ఆధునిక మోడల్ లేదు. ఇంకా సీనియర్ స్టార్ ని మూసఫార్ములా టెంప్లెట్ కథా కథనాలతో బంధించి ఇమేజిని కాపాడలేరు. ఇమేజి మారాల్సిందే. పాత్రలు, పాత్ర చిత్రణలు మారాల్సిందే. నాల్గు పాటలు, వాటికి స్టెప్పులు, నాల్గు ఫైట్లు, కామెడీలూ ఇవన్నీ వదులుకుని ముందుకు పోతున్నారు తమిళ స్టార్ల ఫ్యాన్స్ తో బాటు ప్రేక్షకులు కూడా. కానీ తెలుగు స్టార్ల ఫ్యాన్స్, ప్రేక్షకులు కాలంలో ఎక్కడో ఇరుక్కుని వాటినే డిమాండ్ చేసి తృప్తి తీర్చుకుంటున్నారు. ఆధునిక దృక్పథమనే మాటే లేదు.

దురదృష్టవశాత్తూ చిరంజీవి ఇలాటి ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి లొంగి త్రిశంకు స్వర్గంలో వుండిపోతున్నారు. అయితే ఇలాటి ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ‘భోళాశంకర్’ వాళ్ళూ హించని షాక్ ఇచ్చింది. మెగాస్టార్ తో ఇంకా పాత చింతకాయే చప్పరించి హిట్ చేద్దామనుకున్న వాళ్ళ దూల సమూలంగా తీర్చేసింది. ఇకనైనా బుద్ధిగా మార్పు నాహ్వానించి మెగాస్టార్ ని సోకాల్డ్ ఇమేజి చట్రపు సంకెళ్ళ నుంచి విముక్తి కల్గిస్తే తమిళ ఫ్యాన్స్ తో, ప్రేక్షకులతో సమాన మర్యాద పొంద గల్గుతారు. మెగాస్టార్ కూడా తెలుగునాట ‘భోళాశంకర్’ ని తిరస్కరించి ఎందుకు రజనీ ‘జైలర్’ కి పట్టం గడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఇది మంచి సందర్భం. ఇప్పటికీ మలయాళంలో ఫ్లాపయిన ‘బ్రో డాడీ’ రీమేక్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం. రీమేకులే తనకి శరణ్యమనే అభద్రతా భావం మెగాస్టారే ఫీలైతే ఇతర స్టార్ల పరిస్థితేమిటి? వాళ్ళు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చాక్కా చేసుకుపోతున్నారు.

అయిదు రోజుల ‘భోళా శంకర్’ బాక్సాఫీసు చూస్తే చిరంజీవి ఒక్కరే తన తిరుగులేని స్టార్ డమ్ తో కాపాడలేరని తెలుస్తుంది. చేతిలో కంటెంట్ ఏమిటన్నది పాయింటు. ఏరియాల వారీ అయిదు రోజుల షేర్ : నైజాం 6.91 కోట్లు, సీడెడ్‌ 3.24 కోట్లు, ఉత్తరాంధ్ర 3.18 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.90 కోట్లు, వెస్ట్ గోదావరి 2.19 కోట్లు, గుంటూరు 2.67 కోట్లు, కృష్ణా 1.61 కోట్లు, నెల్లూరు 1.18 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా 1.80 కోట్లు, ఓవర్సీస్‌ 2.20 కోట్లు. మొత్తం 26.88 కోట్లు షేర్. గ్రాస్ 43 కోట్లు.

కాగా, హిందీ డబ్బింగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీ ఒప్పందం నెట్ ఫ్లిక్స్ కుదుర్చుకుంది. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోయినా ‘భోళా శంకర్’ లేచి గాండ్రించే అవకాశం మాత్రం లేదని నిన్నటి 75 లక్షల బాక్సాఫీసుతో తేలిపోయింది!

First Published:  16 Aug 2023 2:11 PM IST
Next Story